రైతు కనకయ్య మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.
*కొనుగోళ్లలో జాప్యంతోనే అన్నదాత బలి: మాజీ మంత్రి హరీశ్ రావు.
*బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం, పరామర్శ.
నారాయణరావుపేట,మహా.
కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకల వల్లే నారాయణరావుపేట మండలానికి చెందిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్) ప్రాణాలు కోల్పోయాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కనకయ్య మరణం ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. గుండెపోటుతో మరణించిన కనకయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
**ఆవేదనే బలితీసుకుంది**
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి కనకయ్య పడ్డ మానసిక క్షోభను హరీశ్ రావు వివరించారు. దాదాపు 45 రోజుల పాటు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో, అకాల వర్షాలకు వడ్లన్నీ తడిసిముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రోజులు పడిగాపులు కాసి ఆ తడిసిన ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళితే, నాలుగు ట్రాక్టర్ల వడ్లకు గాను ఏకంగా 40 సంచుల మేర మిల్లర్లు కోత విధించారని మండిపడ్డారు. ఈ అన్యాయాన్ని తలచుకుని రాత్రి వరకూ బంధువులతో, తోటి రైతులతో బాధపడిన కనకయ్య.. అదే తీవ్ర మనోవేదనతో నిద్రలోనే గుండెపోటుకు గురై మరణించాడని, ఇది స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు.
**రైతుల ఉసురు పోసుకుంటున్నారు**
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అహంకారపూరిత భాష మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. “నేను మళ్లీ గెలుస్తా.. తొక్కుతా.. పండబెడతా” అంటూ ముఖ్యమంత్రి స్థాయికి తగని భాష మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు చేసిందేమిటో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎరువుల సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతుబంధు ఎగ్గొట్టారని, గత నాలుగు నెలలుగా మరణించిన రైతులకు కనీసం రైతుబీమా కూడా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో పంట పండించడం సులువే కానీ, ఆ పంటను అమ్ముకోవాలంటే రైతులకు కళ్లలో రక్తం వచ్చే దుస్థితి (నరకం) దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
**క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరు**
హైదరాబాద్ ఏసీ గదుల్లో కూర్చుని 80 నుంచి 90 శాతం ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, కానీ క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో ఇంకా 30 నుంచి 40 శాతం వడ్లు రోడ్ల మీదే పెండింగ్‌లో ఉన్నాయని హరీశ్ రావు గుర్తుచేశారు. కుకునూరుపల్లి వద్ద ధాన్యం లోడుతో ఉన్న ఒక లారీ ఏకంగా రాజస్థాన్‌కు పరారైన వైనాన్ని ఆయన ఎత్తిచూపారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేర్వాపూర్, ఎన్సాన్‌పల్లిలో సంచులు ఎత్తకపోవడంతో వడ్లకు చెదలు పడుతున్నాయని, మంత్రి దామోదర రాజనర్సింహ సొంత నియోజకవర్గమైన అల్లాదుర్గం మండలం వెంకటాపూర్‌లో ఇప్పటికీ ఒక్క క్వింటాలు ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని వివరించారు. ప్రతి క్వింటాల్‌కు 4 నుంచి 5 కిలోల కోత పెడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు.
**యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు జరగాలి**
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఇకనైనా మొద్దునిద్ర వీడి, ఎలాంటి కోతలు లేకుండా యుద్ధప్రాతిపదికన వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అధికారులు, మంత్రులు నిర్లక్ష్యం వీడి కలెక్టర్ వెంటనే స్పందించాలన్నారు. మరణించిన కనకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, బాధితుడి కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేశారు.








