Mahaa Daily Exclusive

  విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం….

Share

విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం.

*నీట్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.

* కేంద్ర ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం.

హైదరాబాద్, మహా.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతగానితనం వల్లే నేడు లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడే దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని లిబర్టీ సర్కిల్ వద్ద ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఏకంగా పరీక్షను రద్దు చేయాల్సి రావడం కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యానికి సజీవ నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సన్నద్ధమైన విద్యార్థుల శ్రమ.. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా బూడిదలో పోసిన పన్నీరైందని మండిపడ్డారు. ఈ పరాభవానికి, నీట్ పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్ర మానసిక క్షోభకు గురై, నష్టపోయిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

దేశ సరిహద్దుల్లోకి చైనా దళాలు చొచ్చుకొస్తున్నా అడ్డుకోలేని కేంద్ర ప్రభుత్వ చేతగానితనం దేశానికి ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టం పూర్తి కాగానే, సామాన్య ప్రజల నడ్డి విరిచేలా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెను భారాన్ని మోపిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరు పూర్తి నిరాశాజనకంగా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆదర్శంగా నిలుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.