Mahaa Daily Exclusive

  భారత్ మాకు శత్రువు కాదు…సహకార భాగస్వామి.

Share

భారత్ మాకు శత్రువు కాదు…సహకార భాగస్వామి.
* సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు.
* చర్చల ద్వారానే విభేదాల పరిష్కారం.
* రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన డ్రాగన్ దేశం.
బీజింగ్,మహా.
భారత్ పట్ల చైనా తన వైఖరిని మార్చుకుంటూ సరికొత్త రాగాలు అందుకుంటోంది. ఇరు దేశాల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా డ్రాగన్ దేశం స్నేహహస్తం చాచే ప్రయత్నం చేస్తోంది. భారత్, చైనాలు ఎంతమాత్రం ప్రత్యర్థులు లేదా వ్యతిరేక శక్తులు కావని, ఒకరి అభివృద్ధికి మరొకరు ముప్పుగా కాకుండా, పరస్పరం అవకాశాలుగా నిలిచే సహకార భాగస్వాములని చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవల భారత్, చైనాలతో రష్యాకు ఉన్న త్రైపాక్షిక సంబంధాలను ప్రస్తావిస్తూ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యల తర్వాత చైనా నుంచి ఈ సానుకూల స్పందన రావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
**సజావుగానే సమాచార మార్పిడి..**
భారత్, చైనాలను పరస్పర సహకార భాగస్వాములుగా అభివర్ణించిన లిన్ జియాన్, ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమాచార మార్పిడి మార్గాలు అత్యంత సజావుగా సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దిల్లీ, బీజింగ్ ల మధ్య నెలకొనే సానుకూల, స్థిరమైన సంబంధాలు కేవలం ఇరు దేశాలకే కాకుండా మొత్తం ఆసియా ప్రాంత ప్రయోజనాలకు, స్థిరత్వానికి ఎంతో ముఖ్యమైనవని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ఎల్లప్పుడూ వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతోనే చూడాలని, ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ వాటిని కేవలం దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోవడానికి చైనా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
**ప్రపంచ శాంతికి ‘త్రిశక్తి’ మైత్రి..**
రష్యా, భారత్, చైనా దేశాల మధ్య ఉన్న సంబంధాల ప్రాధాన్యతను వివరిస్తూ.. ఈ మూడు కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలని చైనా ప్రతినిధి పేర్కొన్నారు. ఈ మూడు దేశాల మధ్య కొనసాగే బలమైన మైత్రి మరియు సహకారం ప్రపంచ దేశాలలో శాంతిని, స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. భారత్-చైనా దేశాల మధ్య ఉన్న సంబంధాలు అత్యంత సున్నితమైనవిగా, బహుముఖమైనవిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల అంతర్గత, సరిహద్దు వ్యవహారాలలో మూడో పక్షం లేదా మరేదైనా ఇతర దేశం జోక్యం చేసుకోవడం ఎంతమాత్రం తగదని ఆయన హితవు పలికారు. రష్యాకు భారత్, చైనా రెండు దేశాలు కూడా అత్యంత ఆప్తమిత్రులని పేర్కొన్న పుతిన్.. సరిహద్దు వివాదాల వంటి అత్యంత సున్నితమైన అంశాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.