- మహిళా శక్తి మహా సభకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం
- తెలంగాణ మహిళల ఆర్థిక సాధికారతకు మరో మైలురాయి
- మహిళా శక్తిని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపు
హైదరాబాద్, మహా : తెలంగాణ మహిళా ఉద్యమ చరిత్రలో మరో కీలక ఘట్టానికి హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నిర్వహిస్తున్న మహా మహిళా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భారీ కార్యక్రమానికి సుమారు 25 వేల మంది మహిళలు హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో సీఎస్ రామకృష్ణరావు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.
గత రెండేళ్లుగా మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల విస్తరణ, వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఈ సభ ప్రతీకగా నిలవనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తారు. అదే వేదికపై మహిళా సంఘాల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంపై సీఎం ప్రకటన చేయనున్నారు.
సభలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.500 కోట్ల చెక్కులను పంపిణీ చేయనున్నారు. మహిళా సంఘాల ఆర్టీసీ అద్దె బస్సుల హైర్ చార్జీల కింద రూ.20.30 కోట్ల చెక్కులను అందజేయనున్నారు. అలాగే కొత్త బస్సుల కొనుగోలు కోసం టీజీఎస్‌ఆర్టీసీకి రూ.199 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.
ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా మహిళా సంఘాలు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చిన 553 బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు. మహిళల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ వినూత్న రవాణా నమూనా రాష్ట్రంలో మహిళా సాధికారతకు కొత్త గుర్తింపుగా నిలుస్తోంది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు ఇప్పటివరకు రూ.10,700 కోట్ల మేర కలిగిన ఆదా ప్రయోజనాలను వివరించానున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మహిళల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను సభలో వివరించనున్నారు.
ఇప్పటికే జిల్లాల నుంచి వేలాది మంది మహిళలు తమ సంఘాలకు చెందిన సొంత బస్సుల్లో హైదరాబాద్‌కు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి మహిళా శక్తి ఒకే వేదికపై సమీకృతం కానున్న ఈ సభ, తెలంగాణ మహిళల ఆర్థిక ప్రగతి ప్రయాణానికి మరో చారిత్రక మైలురాయిగా నిలవనుంది. సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క సోమవారం పరిశీలించారు. శాఖలు సమన్వయంతో పనిచేసి సభ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆర్థిక వ్యవస్థను నడిపించే భాగస్వాములుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబన, వ్యాపార విస్తరణకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా సంఘ సభ్యురాలు ఈ మహాసభలో భాగస్వామ్యం కావాలని, మహిళా శక్తి ఐక్యతను చాటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.








