- దివ్యాంగ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి
- జిల్లాల్లో అప్లికేషన్లు వెంటనే ఓకే చేయాలి
- మీడియా అకాడమీ చైర్మన్‌కు డీజేఎస్ మెమోరాండం
హైదరాబాద్, మహా : దివ్యాంగులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ యాజమాన్యాల కోటాతో సంబంధం లేకుండా అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని మీడియా అకడామి చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డిని డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) కోరింది. అలాగే కొన్ని జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ దరకాస్తులను వెంటనే ఆమోదించి కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం డీజేఎస్ అధ్యక్షుడు బాదిని ఉపేందర్ ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం, పలువురు డెస్క్ జర్నలిస్టులు ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను కలిసి డెస్క్ జర్నలిస్టు సమస్యలపై మోమోరాండం సమర్పించారు. ఈ సoదర్భంగా దివ్యాంగులైన జర్నలిస్టులకు యాజమాన్యాల కోటాతో సంబంధం లేకుండా ఆక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. అలాగే జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను ఆమోదించడంలో డీపీఆర్వోలు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టులకు జిల్లా కేంద్రంగా అదనంగా అక్రెడిటేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను అమలు చేయడంలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని దృష్టికి తీసుకెళ్లారు. 15 ఏండ్ల ఎక్స్పీరియన్స్ దాటిన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. డీజేఎస్ చేసిన వినతులపై సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్‌రెడ్డి దివ్యాంగులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. జిల్లాల్లో అక్రెడిటేషన్ల ప్రక్రియలో నెలకొన్న ఆలస్యం, జీవో అమలులో నిర్లక్ష్యంలో ఐఅండ్ పీఆర్ అధికారులతో చర్చిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేఎన్ రాజారామ్, కనపర్తి రమేశ్, గుజ్జుల సత్యప్రసాద్. వి, వెంకటరమణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
వినతులు అందజేద్దాం
మంగళవారం హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో ఉన్న ఐఅండ్ పీఆర్ కమిషనరేట్‌లో జరిగే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ మీటింగ్ కు హాజరయ్యే సభ్యులకు అక్రెడిటేషన్ కార్డులు రాని వారంతా కలిసి ఓ వినతి పత్రం అందజేద్దామని డీజేఎస్ ప్రెసిడెంట్ ఉపేందర్ పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న మిత్రులు మంగళవారం ఉదయం ఐఅండ్ పీఆర్ కమిషనరేట్ వద్దకు రావాలని కోరారు.








