Mahaa Daily Exclusive

  2027 వేసవి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ….

Share

2027 వేసవి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ.
* జూలై తొలి వారానికి సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాలు పూర్తి.
*సెప్టెంబర్ నాటికి డిజైన్లు సిద్ధం.. నవంబర్‌లో పనుల షురూ.
*బీఆర్‌ఎస్ లోపాల వల్లే బ్యారేజీలకు నష్టం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
మేడిగడ్డ (కాళేశ్వరం),మహా.
నిర్మాణ లోపాలు, గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యంత శాస్త్రీయ పద్ధతిలో చేపడుతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 2027 వేసవి నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేసి, ప్రాజెక్టులను తిరిగి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జరుగుతున్న సాంకేతిక పరిశోధనలు, హైడ్రాలజికల్ అధ్యయనాలు, జియోటెక్నికల్ పరీక్షలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పునరుద్ధరణ ప్రణాళికల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
**నవంబర్ చివరి వారంలో పనులు ప్రారంభం**
బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలపట్టికను విడుదల చేశారు. జూలై తొలి వారానికి అన్ని రకాల సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాలు పూర్తవుతాయని, ఆ నివేదికలను కేంద్ర జల సంఘం , జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ లకు సమర్పిస్తామని తెలిపారు. ఆయా సంస్థల సూచనలు, ఆమోదం మేరకు సెప్టెంబర్ నాటికి పునరుద్ధరణ డిజైన్లను ఖరారు చేస్తామన్నారు. వర్షాకాలం ముగిసిన వెంటనే, నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఒకే పని సీజన్‌లో పనులన్నీ పూర్తి చేసి 2027 వేసవి కాలం నాటికి బ్యారేజీలను రైతులకు అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు 40 నుంచి 80 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్ తవ్వి భూగర్భ పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మూడు బ్యారేజీల్లో జీపీఆర్ పరీక్షలు 90 శాతం, బోర్‌హోల్ పరిశోధనలు 80 శాతం ముగిశాయని, జూన్ ఆఖరుకు అన్ని పరీక్షలు పూర్తవుతాయని వెల్లడించారు.
**అంతర్జాతీయ నిపుణులతో పునరుద్ధరణ ప్రణాళికలు**
ఈ అత్యంత ప్రతిష్టాత్మక పునరుద్ధరణ ప్రక్రియ కోసం ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టెంట్ సంస్థ ‘ఏ ఎఫ్ ఆర్ వై ‘తో పాటు ఐఐటీ బొంబాయిని నియమించినట్లు మంత్రి తెలిపారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో నమూనా అధ్యయనాలు జరుగుతున్నాయని, జాతీయ, అంతర్జాతీయ నిపుణులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్‌డీఎస్‌ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్-ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిపేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని వివరించారు.
**గత పాలకుల వల్లే ఖజానాపై భారీ భారం**
బీఆర్‌ఎస్ పాలకుల లోపభూయిష్ట విధానాలు, డిజైన్ లోపాల వల్లే మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలు దెబ్బతిన్నాయని మంత్రి ఉత్తమ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2023 అక్టోబర్‌లో జరిగిన ఈ నష్టానికి గత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తే, తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ-డిజైన్ పేరుతో వ్యయాన్ని లక్ష కోట్ల పైచిలుకు పెంచిందని విమర్శించారు. కాగ్ అంచనాల ప్రకారం ఈ వ్యయం రూ.1.45 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. ఇంత భారీ ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పటికీ, బ్యారేజీలు దెబ్బతినడం వల్ల 2023 డిసెంబర్ నుంచి ఇవి వినియోగంలో లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర ఖజానాపై మోయలేని భారాన్ని మోపాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు, ప్రాజెక్టుల భద్రతకే అత్యున్నత ప్రాధాయం ఇస్తోందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన తప్పిదాలన్నింటినీ సరిదిద్ది, శాశ్వత భద్రతా ప్రమాణాలతో బ్యారేజీలను పునరుద్ధరించి, తెలంగాణ రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.