Mahaa Daily Exclusive

  మీనాక్షి నటరాజన్‌కు నిరాశ…

Share

  • మీనాక్షి నటరాజన్‌కు నిరాశ
  • పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
  • రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మహా : తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. మధ్యప్రదేశ్ నుంచి తన రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని ఈ మేరకు స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌.చందూర్కర్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సీనియర్ లాయర్, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆమె తరఫున హాజరై వాదనలు వినిపించారు.

ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఆమెపై లేవని, కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని వివరించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఆర్వో నామినేషన్‌ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అంతేకాదు, గతంలో ఇటువంటి తీర్పులు ఏమైనా ఉంటే న్యాయస్థానం ముందు ఉంచాలని సూచించింది. అభ్యర్థి నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరిస్తే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే సరైందని పేర్కొంది. అవసరమైతే హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం తెలిపింది. అనంతరం పిటిషన్‌ విచారణకు అర్హత లేదంటూ కొట్టివేసింది. తెలంగాణలో నమోదైన కేసు వివరాలను మీనాక్షి తన అఫిడ్‌విట్‌లో వెల్లడించలేదని పేర్కొంటూ ఆమె నామినేషన్‌ను ఆర్వో తిరస్కరించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ జారీ చేసిన ఒక ఉత్తర్వులో అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించిన మీదట మీనాక్షి నటరాజన్ తన నామినేషన్‌తో పాటు సమర్పించిన ఫారం 26లో కోర్టు ఫిర్యాదును చేర్చకుండా అసంపూర్ణ అఫిడవిట్‌ను సమర్పించినట్లు తేలిందని పేర్కొన్నారు.