- మీరు ఎస్ అంటేనే వస్తా
- పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్
- ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్
చెన్నై, మహా : ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. ప్రజలు, అభిమానులకు నిర్ణయం వదిలేస్తూనే… తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తేనే తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని… లేదంటే ఆ ఆలోచన విరమించుకుంటానని లారెన్స్ చెప్పారు. ‘ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మీ సలహాలను కామెంట్స్‌లో పంచుకోండి. మీరు నో అని చెబితే నేను రాజకీయాల్లోకి ప్రవేశించను. సమాజానికి నా నిస్వార్థ సేవ కొనసాగిస్తా. మీరు ఎస్ అంటే పాలిటిక్స్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభించాలనుకుంటున్నానో వెల్లడిస్తా.’ అని వీడియోలో చెప్పారు.
రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడు రాజకీయాల్లో ఓ కీలక మలుపు అనే చెప్పాలి. సీఎం విజయ్ టీవీకే పార్టీలో లారెన్స్ చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి స్థానాల్లో పోటీ చేసిన విజయ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని తిరుచ్చి స్థానం వదులుకున్నారు. ఆ నియోజకవర్గం నుంచి లారెన్స్ పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, లారెన్స్ దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పొలిటికల్ ఎంట్రీని కూడా ప్రజలు, అభిమానుల నిర్ణయానికే వదిలేశారు. లారెన్స్ కేవలం నటనతోనే కాకుండా సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. తన తల్లి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనాథలు, వృద్ధులు, పిల్లలకు సాయం అందిస్తున్నారు. అలాగే, సోషల్ మీడియాలో సాయం అర్థించిన బాధితులకు కూడా తనకు తోచిన సాయం అందిస్తూ ప్రజల మనసుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తి ఎదురుచూస్తుండగా తాజా ట్వీట్ తో త్వరలోనే దీనిపై స్పఎష్టత వచ్చే అవకాశాలున్నాయి.








