- నీట్ రీ ఎగ్జామ్లో మార్పులు
- 15 నిమిషాల సమయం పెంపు
- రఫ్ వర్క్ పేజీలు నాలుగుకు పెంపు
- అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్ టీఏ
న్యూఢిల్లీ, మహా : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న నీట్ రీ ఎగ్జామ్ 2026లో జాతీయ పరీక్షల సంస్థ-(ఎన్ టీఏ) కొన్ని మార్పులు చేసింది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుండగా విద్యార్థుల సౌకర్యార్థం సమయాన్ని మరో 15 నిమిషాలు పొడిగించింది. ఈ నెల 21 మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకూ పరీక్ష జరుగుతుందని ఎన్ టీఏ ప్రకటించింది. మొత్తంగా ఈ పరీక్ష 195 నిమిషాల పాటు జరగనుంది. పరీక్ష ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత ఇన్విజిలేషన్ ప్రక్రియకు పెంచిన సమయం ఉపయోగపడుతుందని తెలిపింది. అభ్యర్థుల నుంచి గత కొన్నేళ్లుగా వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ మార్పులు చేశామని ఎన్ టీఏ తెలిపింది.
అంతేకాకుండా రఫ్ వర్క్ కోసం ఇచ్చే పేజీలను రెట్టింపు చేసినట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ కోసం ఇప్పటివరకూ రెండు పేజీలు ఇస్తుండగా ఈసారి 4 పేజీలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఎడమచేతి వాటం ఉన్న విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నపత్రం మొదట్లో, చివరిలో రెండేసి రఫ్ పేపర్లను ఏర్పాటు చేసినట్లు వివరించింది. గతంలో, రఫ్ వర్క్ పేజీలు కేవలం ప్రశ్నపత్రం బుక్‌లెట్ చివరలో మాత్రమే ఉండేవి. సవరించిన విధానం ప్రకారం, సూచనల పేజీ తర్వాత వెంటనే రెండు రఫ్ వర్క్ పేజీలు ఉంటాయి, అలాగే మరో రెండు అదనపు పేజీలు బుక్‌లెట్ చివరలో ఉంటాయి. ఈ కొత్త విధానం ప్రశ్నపత్రం ఇంగ్లీష్, ప్రాంతీయ భాషా వెర్షన్లు రెండింటిలోనూ ప్రవేశపెట్టారు.
“పరీక్షా విధానంలో చేసే చిన్న, ఆలోచనాత్మకమైన మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్షా సమయంలో అభ్యర్థి సౌకర్యంలో గణనీయమైన మార్పును తీసుకురాగలవు. నీట్ 2026 పరీక్షను పారదర్శకంగా, సురక్షితంగా అభ్యర్థులకు అనుకూలమైన రీతిలో నిర్వహించడానికి, అలాగే ఈ పరీక్షకు హాజరయ్యే లక్షలాది మంది ఆశావహుల కోసం పరీక్షా విధానాన్ని నిరంతరం మెరుగుపరచడానికి తమకున్న నిబద్ధతను ఎన్ టీఏ పునరుద్ఘాటించింది.” అని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతి సంవత్సరం పరీక్షకు హాజరయ్యే లక్షలాది మంది ఆశావహుల కోసం పరీక్షా అనుభవాన్ని మెరుగుపరచడం కొనసాగిస్తామని ఏజెన్సీ చెప్పింది. వాస్తవానికి మే 3న నీట్ జరగ్గా పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. దీంతో ఎన్‌టీఏ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా దానిని రద్దుచేసి, జూన్ 21న మళ్లీ నిర్వహిస్తోంది.








