Mahaa Daily Exclusive

  మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలి….

Share

  • మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలి
  • బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో తేలాలి
  • ఫ్యూచర్ సిటీకి ఫ్యూటర్ లేదు
  • ఇప్పటికి షబ్బీర్ అలీ వాస్తవాలు చెప్పారు
  • కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారు
  • ఎన్నికల్లో ఒంటరి పోరే
  • మీడియా చిట్ చాట్ లో కేటీఆర్

హైదరాబాద్‌, మహా : ప్రతి అంశంపై సిట్ వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ అంశంపై కూడా సిట్ వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్ మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్న అంశంపై ఆయన స్పందించారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే కేసు గురించి ఎన్నికల కమిషన్‌కు చెప్పి ఉంటారన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ‘బ్లాక్ షీప్’ తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. మీనాక్షి నటరాజన్‌కి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీనే కుట్రలు చేసి అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు, డబ్బులకే వస్తున్నాయంటూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా కేటీఆర్ స్పందించారు. ఇప్పికైనా షబ్బీర్ అలీ వాస్తవాలు చెప్పినందుకు అభినందనలు అని అన్నారు. షబ్బీర్ అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారన్నారు. అసలు గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ నేతలే ఆరోపించారని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకున్నదని కేటీఆర్ రోపించారు. ప్రస్తుత సీఎం కూడా డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్నారని, ఆయన పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుందని అన్నారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని ఆయన రెన్యూవల్ సీఎం అని అంటూ షబ్బీర్ అలీ చెప్పిన మాటలు ముమ్మాటికీ వాస్తవమన్నారు.

ఎయిర్ పోర్టు మెట్రో పూర్తయితే ఇంత ట్రాఫిక్ ఉండదని, అయితే ఆ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఆపేశాడని కేటీఆర్ ఆరోపించారు. చినుకు పడితే హైదరాబాద్ చిత్తి అవుతుందని, ఉన్న నగరాన్ని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అనడం ఏంటి? నిలదీశారు. ఫ్యూచర్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి ఊహల్లో బతుకుతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొత్త సిటీ నిర్మాణం కంటే ఉన్న హైదరాబాద్‌ను మరింతగా అభివృద్ధి చేస్తే సరిపోతుందని తన మనసులోని మాటను కేటీఆర్ బయటపెట్టారు. కాంగ్రెస్ అసమర్ద పాలనతో రాష్ట్రం 40 ఏండ్లు వెనక్కి పోయిందని, నర్షాకాలం తొలి వానతకే నగరం చెరువులను తలపించిందన్నారు. ఇందుకు రేవంత్‌ రెడ్డి చేతకాని తనమే కారణమని ఆరోపించారు. ఎక్కడో ఒకచోటు ఒకటి రెండు చెరువులు బాగు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వందల చెరువులను సుందరీకరించామని గుర్తు చేశారు. ఇకనైనా ప్రతిపక్షాలను తిట్టడం ఈపేసి సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

జులైలో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందని మాకు సమాచారం ఉందని, దేశం మొత్తం కాకున్నా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని కేటీఆర్ అన్నారు. జమిలి ఎన్నికలపై ప్రస్తావించగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఇంతకన్నా అన్యాయం మరోటి లేదన్నారు.

కేసీఆర్‌ బస్సు యాత్ర ఉంటుంది

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని, ఆయితే ఎప్పటి నుంచి మొదలు పెడతారన్నది ఖచ్చితంగా చెప్పలేనన్నారు. సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోందని, ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, మిగతా నియోజకవర్గాల్లో త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో రోజు రోజుకూ వ్యతిరేకత తీవ్ర మవుతోందని, రాబోయే 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ కు ఓటేసేందుకు ప్రజలు భయపడేలా పరిస్థితి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, కాంగ్రెస్ మూడవ స్థానానికి పరిమితమవడం ఖాయమన్నారు. ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.