Mahaa Daily Exclusive

  తిరుమలలో వరుణుడి ప్రతాపం…

Share

తిరుమలలో వరుణుడి ప్రతాపం.
* కుండపోత వర్షంతో తడిసి ముద్దయిన సప్తగిరులు.
*జలమయమైన మాడ వీధులు.
*’అలిపిరి నడక మార్గంలో జలపాతాలను తలపించిన మెట్లు.
* వణికిపోయిన వృద్ధులు, చిన్నారులు.
* ఘాట్ రోడ్లలో ప్రమాదాలపై టీటీడీ హైఅలర్ట్.
తిరుమల, మహా.
భానుడి భగభగలతో అల్లాడిపోతున్న కలియుగ వైకుంఠం తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులపై వరుణ దేవుడు ఒక్కసారిగా తన ప్రతాపం చూపించాడు. సప్తగిరులపై ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం విరుచుకుపడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ భారీ వర్షానికి తిరుమల గిరులన్నీ తడిసి ముద్దయ్యాయి. ప్రధాన ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం కావడంతో శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తీవ్ర అగచాట్లు పడ్డారు. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక మార్పుతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత పెరగడంతో భక్తులు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలికి వణికిపోయారు.
శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో పాటు, దర్శనం ముగించుకుని గదులకు తిరుగు పయనమైన వారు ఈ కుండపోత వర్షంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నుంచి తలదాచుకునేందుకు దారిలో ఎక్కడా సరైన ఆశ్రయం లేక దారిపొడవునా ఉన్న షెడ్ల కిందకు పరుగులు తీశారు. శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు, నాలుగు మాడ వీధులు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నదులను తలపిస్తూ ఉధృతంగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరడంతో స్థానికంగా ఉన్న దుకాణాల్లోకి కూడా వర్షపు నీరు చొరబడింది. దుకాణాల్లోని వ్యాపార సామగ్రి, వస్తువులు పూర్తిగా తడిసిపోవడంతో స్థానిక చిరువ్యాపారులు ఊహించని నష్టాన్ని మూటగట్టుకున్నారు. దర్శనానికి వెళ్లాలన్నా, తిరిగి బస చేసే ప్రాంతాలకు చేరుకోవాలన్నా భక్తులు మోకాల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.
అలిపిరి నడక మార్గంలో అయితే పరిస్థితి మరింత భయానకంగా మారింది. కొండపై కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరంతా పోటెత్తి మెట్ల గుండా ఉధృతంగా కిందకు కొట్టుకువచ్చింది. మెట్ల మార్గం మొత్తం జలపాతాన్ని తలపించింది. దీంతో కాలినడకన గోవింద నామస్మరణతో మెట్లు ఎక్కుతున్న భక్తులు ఆ వరద ఉధృతికి ముందుకు అడుగు వేయలేక తీవ్ర అవస్థలు పడ్డారు. ఎక్కడికక్కడ భక్తులు నిలిచిపోయి భయాందోళనలకు గురయ్యారు. నిరంతరాయంగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లలో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిందని టీటీడీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొండపై వర్షం కారణంగా అక్కడక్కడా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, బండరాళ్లు, మట్టి పెళ్లలు రోడ్డుపై పడే ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు. తిరుమలకు రాకపోకలు సాగించే వాహనదారులు, ఆర్టీసీ డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాల వేగాన్ని పెంచకుండా సురక్షితంగా ప్రయాణించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందస్తు జాగ్రత్తగా టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.