అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో తాజా మెలిక.
* ‘హార్ముజ్’, యురేనియంపై రాజీ లేదన్న టెహ్రాన్.
* ట్రంప్ ఆశలపై నీళ్లు.. 60 రోజుల ముసాయిదాపై సర్వత్రా ఉత్కంఠ.
వాషింగ్టన్, మహా.
తీవ్ర ఉద్రిక్తతల మధ్య రగులుతున్న పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తాయనుకున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాదాపు ఖరారైందనుకున్న చారిత్రక శాంతి ఒప్పందంలో టెహ్రాన్ అకస్మాత్తుగా కొత్త మెలిక పెట్టింది. కీలకమైన హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను వదులుకునేది లేదని, అలాగే యురేనియం శుద్ధీకరణ హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. యురేనియం అంశంపై ఇరాన్ కాస్త మెట్టు దిగిందని, ఈ వారాంతంలోనే ఐరోపా వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ మేరకు యూటర్న్ తీసుకోవడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. ట్రంప్ ప్రకటనతో అగ్రరాజ్యం ఇరాన్‌పై జరపాలనుకున్న తాజా క్షిపణి దాడులు ఆగిపోయాయని, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో పాటు చమురు ధరలు సైతం ఒక్కసారిగా దిగివచ్చాయని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ముసాయిదా ఒప్పందంలోని సున్నితమైన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వేళ, ఇరాన్ తన కఠిన వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టి మళ్లీ కథను మొదటికి తెచ్చింది.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థలైన ఐఆర్‌ఎన్‌ఏ (IRNA), మెహర్ ఏజెన్సీల కథనాల ప్రకారం.. ప్రస్తుతం అమెరికాతో ఖరారవుతున్న ముసాయిదాలో హార్ముజ్ జలసంధి నిర్వహణ హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలసంధి భవిష్యత్ నిర్వహణ అనేది పూర్తిగా ప్రాంతీయ అంశమని, దీనిపై ఇరాన్, ఒమాన్ దేశాలు మాత్రమే సంయుక్తంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. గతంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు ఉన్న పరిస్థితులను యథాతథంగా పునరుద్ధరించేలా ఎలాంటి నిబంధనలకూ తాము అంగీకరించలేదని ఇరాన్ తేల్చిచెప్పింది. అలాగే, తమ అణు కార్యక్రమానికి సంబంధించి కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రాథమిక సూత్రాల పరిధిలోనే చర్చలు జరుగుతాయని స్పష్టం చేసింది. యురేనియంను శుద్ధీకరించే (Uranium Enrichment) సార్వభౌమ హక్కును గానీ, ఇప్పటికే శుద్ధీకరించిన యురేనియం నిల్వలను అట్టిపెట్టుకునే హక్కును గానీ తుది ఒప్పందంలో వదులుకోబోమని ఇరాన్ అధికారులు స్పష్టం చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
మరోవైపు, ఇరు దేశాల మధ్య చర్చల దశలో ఉన్న ‘ఇస్లామాబాద్ ముసాయిదా ఒప్పందం’లో భాగంగా 60 రోజుల ప్రత్యేక చర్చల వ్యవధిని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేలా ఈ ముసాయిదాలో శాశ్వత కాల్పుల విరమణ అంశాన్ని చేర్చారు. ఈ అరవై రోజుల వ్యవధిలో అణు కార్యక్రమం, అమెరికా విధించిన ఆంక్షల ఎత్తివేత, ఇరాన్‌కు చెందిన సుమారు 24 బిలియన్ డాలర్ల స్తంభింపచేసిన నిధుల విడుదల తదితర అంశాలపై తుది చర్చలు జరగాల్సి ఉంది. వచ్చే వారంలో ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 సదస్సుకు ముందే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపుపై ఒక అవగాహనకు రావాలని అమెరికా భావిస్తుండగా.. ఇరాన్ మాత్రం దీనిపై ఇంకా తుది ఆమోదం తెలపలేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. ఒకపక్క ఒప్పంద పత్రాలు తుది దశకు చేరుకున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా మొజ్తబా ఖమేనీ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే అధికారిక లాంఛనాలు పూర్తవుతాయని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య తలెత్తిన ఈ తాజా ప్రతిష్టంభన ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.








