Mahaa Daily Exclusive

  తెలుగు రైతుల కళ్లల్లో ‘కారం’ కొట్టిన డ్రాగన్…

Share

తెలుగు రైతుల కళ్లల్లో ‘కారం’ కొట్టిన డ్రాగన్.
* మన ఎండుమిర్చిపై చైనా సంచలన నిషేధం!
*’తేజ’ మిర్చి ఎగుమతులపై ఉక్కుపాదం.
* రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలకు వేల కోట్ల నష్టం.
* ‘మిథామిడోపాస్’ రసాయనమే కారణమంటూ కుటిల బుద్ధి చాటుకున్న డ్రాగన్ దేశం.
హైదరాబాద్, మహా.
బియ్యం ఎగుమతులపై ఆంక్షలతో మన రైతుల కడుపు కొట్టిన చైనా.. ఇప్పుడు ఏకంగా ‘ఎర్ర బంగారం’పై కన్నెర్రజేసింది. అహర్నిశలు కష్టపడి పండిస్తున్న భారతీయ ఎండుమిర్చిపై డ్రాగన్ దేశం పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. ‘మిథామిడోపాస్’ అనే విషపూరిత రసాయనం సాకును చూపుతూ మన మిర్చి ఎగుమతులపై ఉక్కుపాదం మోపింది. ఈ అకస్మాత్తు పిడుగుపాటుతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది రైతులు, వేలాది వ్యాపారుల భవిష్యత్తు ఒక్కసారిగా అగమ్యగోచరంగా మారింది. నిన్నటి దాకా భారతీయ బియ్యంపై రసాయనాల సాకుతో నిషేధం విధించిన చైనా, ఇప్పుడు ఏకంగా మన ఎండుమిర్చిపై కూడా పూర్తి స్థాయి ఆంక్షల వేటు వేసి తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకుంది.
**విషతుల్యంగా మన మిర్చి.. ఆరోపిస్తున్న డ్రాగన్!**
భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండుమిర్చిలో ప్రాణాంతకమైన ‘మిథామిడోపాస్’ అనే హానికర రసాయన అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయని చైనా కస్టమ్స్, ఆరోగ్య అధికారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అత్యంత విషపూరితమైన ఈ పురుగుల మందు నేరుగా మనుషుల నాడీ వ్యవస్థను ఛిద్రం చేస్తుందని, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతుందన్న సాకుతో ఈ కఠిన నిర్ణయానికి తెరతీసింది. కేవలం ఈ ఒక్క కెమికల్ వల్లే భారతీయ మిర్చిని తమ దేశంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదంటూ చైనా కరాఖండీగా తేల్చిచెప్పడం గమనార్హం.
**దేశంలో ‘ఎర్ర బంగారం’ పండేది ఎక్కడంటే..**
ప్రపంచంలోనే అత్యధికంగా మిర్చిని ఉత్పత్తి చేస్తూ, ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే మిర్చి సాగులో సింహభాగం ఆక్రమించాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎండుమిర్చి అధికంగా పండుతుంది. నాణ్యతలోనూ, ఘాటులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో పండే మిర్చీకి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని డిమాండ్ ఉంది. ఖమ్మం, వరంగల్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల మిర్చి యార్డులు ఆసియాలోనే అతిపెద్ద స్పైస్ మార్కెట్లుగా కీర్తి గడించాయి. ఇక్కడి నుంచే సింహభాగం ఎగుమతులు విదేశాలకు వెళ్తుంటాయి.
**తెలుగు రాష్ట్రాల ‘తేజ’కే చైనా ఫిదా..**
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా ‘తేజ’ (ఎస్-17), ‘గుంటూరు సన్నం’ (ఎస్-4), 334, 341, దేవనూరు డీలక్స్, బ్యాడ్గి, వండర్ హాట్ వంటి అత్యుత్తమ రకాలను రైతులు పండిస్తున్నారు. అయితే ఇందులో చైనాకు అత్యంత ఇష్టమైన, ప్రాణప్రదమైన రకం మాత్రం ‘తేజ’. చైనా దిగుమతి చేసుకునే మిర్చీని ఎక్కువ శాతం ‘ఓలియోరెజిన్’ అనే రంగు, ఘాటునిచ్చే పదార్థాన్ని వెలికి తీసేందుకు వినియోగిస్తోంది. సహజసిద్ధమైన స్పైసీ ఫ్లేవర్ కోసం డ్రాగన్ దేశపు ఫుడ్ ఇండస్ట్రీస్ మన ఖమ్మం, వరంగల్, గుంటూరు ‘తేజ’ మిర్చీ కోసం ఎగబడతాయి. గ్లోబల్ మార్కెట్‌తో పోలిస్తే మన దగ్గర ధర తక్కువగా ఉండటం, అలాగే అత్యధిక ఓలియోరెజిన్ దిగుబడి లభించే మిర్చి కావడంతో చైనా ఎప్పుడూ ఇండియన్ ‘తేజ’ మిర్చి కొనుగోలుకు అత్యంత ఆసక్తి చూపుతూ వస్తోంది.
**లక్షల టన్నుల మార్కెట్‌పై కోలుకోలేని దెబ్బ!**
అంతర్జాతీయ మార్కెట్లో చైనాకు ఎండుమిర్చి సరఫరా చేసే దేశాల జాబితాలో భారతదేశం మూడో స్థానంలో ఉందన్నది కాదనలేని సత్యం. చైనా స్పైస్ మార్కెట్ ప్రధానంగా మన మిర్చీపైనే ఆధారపడి నడుస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2 లక్షల 75 వేల టన్నుల ఎండు మిరపకాయలు చైనాకు దిగుమతి అయ్యాయి. ఇది గత ఏడాదితో పోల్చుకుంటే ఏకంగా 32 శాతం అధికం కావడం విశేషం. అంతేకాకుండా, ఈ ఏడాది కూడా ఏకంగా 20 శాతం వృద్ధితో 7 లక్షల 40 వేల టన్నుల రికార్డు స్థాయి ఎగుమతులకు మన దేశం చేరుకుంది. గత 2024-25 తర్వాత భారత్ నుంచి దిగుమతుల శాతాన్ని పెంచిన చైనా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి ఏకంగా 3 వేల కంటైనర్లలో మిర్చిని రవాణా చేసుకుంది.
**తెలుగింటి రైతన్నకు వేల కోట్ల నష్టం.. నాణ్యతా లోపమా.. కుట్ర పూరిత వ్యూహమా?**
అయితే, ఇటీవల వెళ్లిన ఆ మూడు వేల కంటైనర్లలో 10 నుంచి 15 శాతం సరుకులో క్వాలిటీ సమస్యలు ఉన్నాయంటూ చైనా ఇప్పుడు కొత్తగా కొర్రీలు పెట్టింది. ఒకవైపు సరుకులో తేమ శాతం ఎక్కువగా ఉండటం, మరోవైపు ప్రమాదకరమైన పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలడంతో ఆయా కంటైనర్లను నిర్దాక్షిణ్యంగా భారత్‌కే వెనక్కి తిప్పికొట్టింది. చైనా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతులకు ఊహించని నష్టం వాటిల్లనుంది. ప్రధానంగా ఎగుమతుల మీదే ఆధారపడి వేల ఎకరాల్లో లక్షలు అప్పులు చేసి ‘తేజ’ రకాన్ని సాగు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ నిషేధం వల్ల ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లయిన గుంటూరు, ఖమ్మం, వరంగల్ యార్డులలో కొనుగోళ్లు నిలిచిపోయి, డిమాండ్ లేక ధరలు పాతాళానికి పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీనివల్ల ఏటా సుమారు రూ. 5,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల రూపాయల పైచిలుకు వ్యాపారం దెబ్బతింటుందని అంచనా. అకస్మాత్తుగా అమలులోకి వచ్చిన ఈ నిషేధంతో వేల కోట్ల రూపాయల సరుకును ఇప్పుడు ఏం చేసుకోవాలో తెలియక భారతీయ ఎగుమతిదారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు చైనా పన్నిన కుట్రనా అన్న కోణంలోనూ వాణిజ్య, ఎగుమతిదారుల వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా డ్రాగన్ నిర్ణయం ఇప్పుడు తెలుగింటి మిర్చి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.