Mahaa Daily Exclusive

  కన్న పేగును కబళించిన దారిద్ర్యం…

Share

కన్న పేగును కబళించిన దారిద్ర్యం.
* నాన్నే యముడై నదిలో ముంచేసిన వైనం.
* అభం శుభం తెలియని పసిప్రాణాల సజీవ జలసమాధి.
* కామారెడ్డి జిల్లాలో గుండెలు పిండే విషాదం.
* విగతజీవులుగా కళ్లెదుటే భర్త, బిడ్డలు.
* కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న అభాగ్యురాలు.
కామారెడ్డి, మహా.

“నాన్నొచ్చాడు.. పదా బయటకెళ్దాం..” అంటూ ఆ పసికందులు ఎంతో సంబరపడ్డారు. రోజూ లాగే నాన్న వడిలో చేరి మురిసిపోయారు. తమను ఆప్యాయంగా బైక్‌పై ఎక్కించుకుని, ముద్దలు కలిపి కడుపునిండా అన్నం పెట్టిన ఆ చేతులే.. తమ పాలిట మృత్యుపాశాలవుతాయని ఆ చిన్నారి ప్రాణాలు ఊహించలేకపోయాయి. నడిపించే నాన్నే నదిలో ముంచేస్తాడని ఆ పసి హృదయాలకు ఏం తెలుసు పాపం! కన్న పేగును కడతేర్చిన ఓ కసాయి తండ్రి అకృత్యం.. దారిద్ర్యం, నిరాశ సృష్టించిన ఓ తీవ్ర విషాదం.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు సాక్షిగా యావత్ రాష్ట్రాన్ని, మానవ సమాజాన్ని కన్నీట ముంచేసింది.
సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన కృష్ణ తన భార్య, ఇద్దరు బిడ్డలు రక్షిత్ (8), అనన్య (5)లతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ పటాన్‌చెరుకు వలస వచ్చాడు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకు. కానీ విధి వక్రీకరించింది. చేతిలో పనిలేక, జేబులో చిల్లిగవ్వ లేక ఆ కుటుంబం పస్తుల పాలైంది. ఆర్థిక ఇబ్బందులు ఆ ఇంటి నెమ్మదిని పూర్తిగా దూరం చేశాయి. పూట గడవని పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య మొదలైన చిన్నపాటి కలహాలు.. కృష్ణ మనసులో ప్రాణాలు తీసుకోవాలన్నంతగా తీవ్ర అగాధాన్ని, నిరాశను సృష్టించాయి. పేదరికం తెచ్చిన ఆ భయంకరమైన ఒత్తిడి, ఆ తండ్రిలో విచక్షణను చంపేసింది. బతుకుపై విరక్తితో తను చనిపోవాలనుకోవడమే కాకుండా, తనతో పాటే తన పిల్లలనూ ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరం చేయాలని ఆ తండ్రి నిర్ణయించుకోవడం అత్యంత హృదయ విదారకం.
స్వగ్రామానికి వచ్చిన కృష్ణ, ఆ పసివాళ్లను వెంటబెట్టుకుని నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. చనిపోయే ముందు బిడ్డలకు కడుపునిండా భోజనం పెట్టాడు. ప్రాజెక్టు కట్టపై వారితో కాసేపు ఆడిపాడాడు. నాన్న ఆప్యాయతను చూసి ఆ చిన్నారులు ఆనందంలో తేలిపోతుండగానే.. కృష్ణలోని విలక్షణమైన మానసిక సంఘర్షణ ఒక కసాయి రూపం దాల్చింది. 20వ గేటు వద్ద ఉన్న ఓ పాత తెప్పపై ఆ ఇద్దరు పసివాళ్లను ఎక్కించి నీళ్లలోకి తీసుకువెళ్లాడు. చుట్టూ ఎవరూ లేనిది చూసి, ఏ పాపం తెలియని ఆ పసికందులను నిర్దాక్షిణ్యంగా నదిలోకి తోసేశాడు. “నాన్నా..” అంటూ ఆ చిన్నారులు ప్రాణభయంతో నీటిలో కొట్టుమిట్టాడుతుంటే, ఆ తండ్రి గుండె ఎలా సహించిందో ఏమో.. చివరకు తాను కూడా అదే నీటిలో దూకి జలసమాధి అయ్యాడు.
అప్పటివరకు తన బిడ్డలు నాన్నతో పాటే సురక్షితంగా ఉన్నారని ఇంట్లో ఎదురుచూసిన ఆ తల్లి.. మధ్యాహ్నం గడిచి, సాయంత్రమవుతున్నా రాకపోయేసరికి తీవ్ర ఆందోళనకు గురైంది. అల్లుడితో ఫోన్ చేయించగా, “నేను రాను, మీరే ఇక్కడికి రండి” అంటూ కృష్ణ వాట్సాప్‌లో లొకేషన్ పంపి ఫోన్ కట్ చేశాడు. ఆ మాటలతో గుండె ఆగినంత పనైన ఆ భార్య, బంధువులతో కలిసి ఆ ప్రదేశానికి చేరుకునేలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. పోలీసుల రెస్క్యూ టీమ్ సాయంతో నీటిలో నుంచి విగతజీవులుగా బయటకు వచ్చిన తన ముద్దుల బిడ్డలను, భర్తను చూసి ఆ తల్లి రోదించిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. చేతికి అందివచ్చిన కొడుకు, అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేరన్న చేదు నిజం జీర్ణించుకోలేక ఆ తల్లి అక్కడే స్పృహ తప్పి పడిపోవడం చూపరుల గుండెలను పిండేసింది.
ఈ ఘోర కలి మానవ సమాజాన్ని తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. నిరుద్యోగం, పేదరికం, మానసిక ఒత్తిడి ఒక మనిషిని ఎంతటి అమానుష స్థితికి నెట్టేస్తాయో ఈ విషాదం కళ్లకు కట్టింది. జీవితంలో కష్టాలు రావడం సహజం, దారిద్ర్యం వెంటాడటం మామూలే.. కానీ ఆ సమస్యలకు భయపడి పసికందుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ఎన్ని కష్టాలున్నా.. ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కానే కాదు. బతుకు దారి కనిపించనప్పుడు, తీవ్రమైన మానసిక క్షోభకు గురైనప్పుడు సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడాలి. ఆత్మీయుల అండ, సమాజం చూపించే కాస్తంత సానుభూతి.. తోటి మనుషుల పట్ల మనం చూపే చిన్నపాటి శ్రద్ధ.. ఇలాంటి ఎన్నో ప్రాణాలను నిలబెడతాయి. కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇద్దాం.. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేద్దాం.