Mahaa Daily Exclusive

  వికారాబాద్ కలెక్టర్ పై మహిళ దాడి, అధికారుల కార్లు ధ్వంసం.. !

Share

వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ పై అభిప్రాయ సేకరణ హై టెన్షన్ క్రియేట్ చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగ్గిచర్లలో ఫార్మా విలేజ్ పై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పై మహిళా రైతు చెయ్యి చేసుకున్న ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.

 

ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ

ఫార్మా విలేజ్ కు సంబంధించి వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో లగ్గిచర్ల, పోలేపల్లి, హకీం పేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్ ను ఏర్పాటు చేయటం కోసం మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు .ఈ క్రమంలో చాలామంది రైతులు భూములను స్వచ్చందంగా ఇచ్చేశారు.

 

లగ్గిచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

అయితే లగ్గిచర్ల గ్రామంలో రైతుల నుండి భూములను సేకరించటం కోసం రెండు కిలో మీటర్ల దూరంలో తాత్కాలిక సభను నిర్వహించటం కోసం ప్రయత్నం చేశారు. అయితే ఇది గ్రామానికి దూరంగా ఉండటం కారణంగా రైతులు, గ్రామస్తులు ఈ సభపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించగా ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.

 

కలెక్టర్ పై దాడి చేసిన మహిళ.. ఉద్రిక్తత

ఈ క్రమంలో ఒక్కసారిగా ఒక మహిళ రైతు కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనుక నుండి వచ్చి భుజం మీద కొట్టారు. దీంతో అక్కడ ఆయన ఒక్కసారిగా ముందుకు తూలారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులకు, అధికారులకు మధ్య వాగ్వాదం కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో గ్రామస్తులు కూడా ఆందోళన తీవ్రతరం చేశారు. రాళ్ళు, కర్రలతో రెచ్చిపోయారు. అధికారులకు చెందిన మూడు కార్లు ధ్వంసం చేశారు.

 

రాళ్ళ దాడిలో గాయపడిన కుడా ప్రత్యేక అధికారి

దీంతో పోలీసులు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నేపధ్యంలో కలెక్టర్ ను అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ రాళ్ళ దాడిలో కుడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి రాళ్ళు తగలటంతో గాయాలయ్యాయి. ఆయన అక్కడ నుండి పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

 

ఫార్మా విలేజ్ పై ప్రజలలో ఆందోళన

వికారాబాద్ లో ఫార్మా సెజ్ ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఫార్మా సెజ్ ఏర్పాటుతో తమకు నష్టం జరుగుతుందని, తమ భూముల సారం కోల్పోతామని, తమ జీవనాధారం కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు ఈరోజు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే వికారాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.