సీఎం విజయ్‌పై నటి సమంత ప్రశంసలు.
* ఆయన కేవలం వెండితెరకే పరిమితమయ్యే హీరో కాదు..
* మార్పు తేగలనన్న నమ్మకమే ఆయనను నడిపిస్తోంది.
* చెన్నైలో ముఖ్యమంత్రి విజయ్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.
చెన్నై, మహా.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌పై ప్రముఖ నటి సమంత ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన కేవలం వెండితెరపై మెరిసే హీరో మాత్రమే కాదని, అంతకుమించిన గొప్ప స్థానానికి అర్హుడని తాను ఎప్పటినుంచో బలంగా నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. చెన్నైలో ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన సందర్భంగా, తన సంతోషాన్ని, ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా సమంత పంచుకున్నారు.
నేడు తాను చెన్నైలో అడుగుపెట్టగానే చెప్పలేనంత ఆనందం కలిగిందని, తమ ముఖ్యమంత్రిని కలవబోతున్నాననే ఉత్సాహమే అందుకు కారణమని సమంత పేర్కొన్నారు. విజయ్ సర్ ఎనర్జీ, ఆయన ఉన్న చోట ఉండే వాతావరణం, ప్రజల నుంచి ఆయనకు వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తే.. ఆయన ఏదో గొప్ప లక్ష్యం కోసమే పుట్టారని తనకు ఎప్పుడూ అనిపించేదని ఆమె గుర్తుచేసుకున్నారు.
తాను ఎంతో పట్టు సాధించిన సినీ రంగాన్ని వదిలిపెట్టి, సవాళ్లతో కూడుకున్న రాజకీయాలు అనే పూర్తిగా కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు విజయ్ చూపించిన ధైర్యం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని సమంత స్పష్టం చేశారు. ఇది సులభం కాదని తెలిసినా, సమాజంలో మార్పు తీసుకురాగలనన్న బలమైన నమ్మకంతోనే ఆయన ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. జీవితంలో ఏదో ఒక దశలో సమాజం కోసం ఏదైనా చేయాలన్న అంతర్గత పిలుపు అందరికీ వస్తుందని, కానీ చాలా కొద్ది మంది మాత్రమే తమ స్వార్థాన్ని పక్కనపెట్టి ఆ పిలుపునకు స్పందిస్తారని, ఆ కోవలోనే విజయ్ అడుగు ముందుకేశారని ఆమె కొనియాడారు.
విజయ్ తన పనితీరుతో ఆయనను నమ్ముకున్న ప్రజలను మాత్రమే కాకుండా, అందరినీ ఆశ్చర్యపరుస్తారన్న నమ్మకం తనకు ఉందని సమంత ధీమా వ్యక్తం చేశారు. ఆయన అధిరోహించిన పదవిని బట్టి కాకుండా, ప్రజలకు సేవ చేయాలన్న ఆయనకున్న చిత్తశుద్ధిని బట్టి తాను ఈ మాట చెబుతున్నానన్నారు. ప్రజాసేవలో ఆయన ఇదే స్ఫూర్తితో ముందుకు సాగేందుకు మరింత బలం, జ్ఞానం, ధైర్యం లభించాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆమె ఆకాంక్షించారు. అంతేకాకుండా, యువతరం మొత్తానికి ఇదొక గొప్ప సందేశమని.. మనం మొదట కన్న కల కంటే, మన జీవిత లక్ష్యం ఎంతో గొప్పగా ఉండవచ్చనే దానికి విజయ్ ప్రయాణమే ఒక స్పష్టమైన ఉదాహరణ అని సమంత తన పోస్ట్‌లో హర్షం వ్యక్తం చేశారు.








