Mahaa Daily Exclusive

  టమోటా రైతుకు మళ్లీ ‘ధర’ల దెబ్బ!

Share

టమోటా రైతుకు మళ్లీ ‘ధర’ల దెబ్బ!
* వారం వ్యవధిలోనే భారీగా తగ్గిన ధరలు.
* మార్కెట్లకు పోటెత్తుతున్న పంట.
* ఆందోళనలో అన్నదాతలు.
* పెరిగిన పెట్టుబడులు.. చేతికందని లాభాలు.
రామకుప్పం (చిత్తూరు):మహా.
జిల్లాలోని టమోటా సాగుదారులు మళ్లీ నిరాశలో మునిగిపోయారు. వారం రోజుల క్రితం వరకు ఆశాజనకంగా ఉన్న టమోటా ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం జిల్లాలోని రామకుప్పం, వి.కోట, ఏడోబైలు, పలమనేరు మార్కెట్లలో అత్యంత నాణ్యత కలిగిన టమోటా (15 కిలోల బాక్సు) ధర గరిష్టంగా రూ. 600 వరకు పలికింది. అలాగే మధ్యస్త రకం టమోటా బాక్సు రూ. 350 నుంచి రూ. 400 వరకు, చిన్న సైజు రకం రూ. 250 నుంచి రూ. 300 వరకు ధర పలికింది. కానీ, వారం రోజులుగా స్థానిక మార్కెట్లకు టమోటా దిగుబడులు భారీగా పోటెత్తడం, దీనికి తోడు పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున నిల్వలు వస్తుండటంతో ఒక్కసారిగా గిరాకీ తగ్గిపోయింది. ఫలితంగా గత నాలుగైదు రోజులుగా మార్కెట్లో టమోటా ధరలు వేగంగా పడిపోతున్నాయి.
అత్యంత నాణ్యమైన టమోటా బాక్సు ధర రూ. 400లకు పడిపోగా, మధ్యస్త రకం బాక్సు రూ. 250 నుంచి రూ. 300లకే పరిమితమైంది. ఇక చిన్న సైజు టమోటాల బాక్సు ధర మరీ దారుణంగా రూ. 120 నుంచి రూ. 150ల వరకే పలికినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తోటలకు తీవ్రంగా చీడపీడలు ఆశించాయని, వాటి నుంచి పంటను కాపాడుకునేందుకు తాము భారీగా ఖర్చు పెట్టి సస్యరక్షణ మందులను కొనుగోలు చేసి వాడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇలా అడ్డూఅదుపూ లేకుండా పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో.. మార్కెట్లో ఉన్నట్టుండి ధరలు ఇలా దారుణంగా పడిపోవడం తమను కోలుకోలేని దెబ్బ తీస్తోందని అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.