Mahaa Daily Exclusive

  అందగత్తెలకు కుటుంబ సౌఖ్యం ఉండదు…

Share

అందగత్తెలకు కుటుంబ సౌఖ్యం ఉండదు.
* వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.
* సినిమా హీరోయిన్ల జీవితాలే ఇందుకు ఉదాహరణ అన్న ప్రముఖ జ్యోతిష్యుడు.
* కలియుగంలో అమ్మాయిలు మోసం చేసేవాళ్లనే ఇష్టపడుతున్నారు.

హైదరాబాద్, మహా.

ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. మహిళల వివాహ బంధాలు, సినిమా ఇండస్ట్రీ, కలియుగంలో మనుషుల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అందమైన అమ్మాయిలకు కుటుంబ సౌఖ్యం దక్కదంటూ ఆయన చేసిన వ్యాఖ్యానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ.. అందంగా ఉండే అమ్మాయిల భర్తలు త్వరగా చనిపోవడం లేదా వారు భర్తలతో విడిపోవడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. అందమైన అమ్మాయిలకు కుటుంబ పరమైన సుఖసంతోషాలు ఉండకపోవడం అనేది ఇంద్రుడు ఇచ్చిన శాపమని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో ఎంతోమంది అందగత్తెలను చూస్తే.. వారు తమ కంటే వయసులో చాలా పెద్దవారైన (ఏజ్ గ్యాప్ ఉన్న) వారిని పెళ్లి చేసుకోవడమో, లేదంటే ఎవరికైనా రెండో భార్యగా (సెకండ్ వైఫ్) వెళ్లడమో జరిగిందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా సినిమా పరిశ్రమలోని చాలా మంది హీరోయిన్ల జీవితాలనే తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది హీరోయిన్లు వయసు వ్యత్యాసం ఉన్నవారిని పెళ్లాడటం లేదా రెండో భార్యలుగా వెళ్లడం మనం చూస్తూనే ఉన్నామని వివరించారు.
ప్రస్తుత కలియుగంలో అమ్మాయిల మనస్తత్వాలు మారిపోయాయని వేణుస్వామి విమర్శించారు. ఈ రోజుల్లో అమ్మాయిలు తమను నిజాయితీగా ప్రేమించే వారి కంటే.. మోసం చేసే వారి వైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని అన్నారు. చుట్టూ ఎన్ని మంచి తులసి మొక్కలు ఉన్నప్పటికీ, వాటిని వదిలేసి వెళ్లి గంజాయి మొక్కనే పట్టుకుంటారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివాహాల విషయంలో కొందరు చేస్తున్న తప్పులను కూడా ఆయన ఎండగట్టారు. చాలామందికి జాతకాలు కలవకపోయినప్పటికీ.. కేవలం పేర్లు మార్చుకుని మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, అది శాస్త్రరీత్యా తీవ్రమైన తప్పిదమని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల జీవితంలో అనేక దోషాలు చుట్టుముడతాయని, ఎలాంటి దోషాలు లేకుంటేనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఆయన హితవు పలికారు.
గతంలోనూ వేణుస్వామి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు. అయితే, సినిమా ఇండస్ట్రీకి చెందిన రెండు మూడు ప్రముఖ జంటలు విడిపోతాయని ఆయన ముందుగానే చెప్పిన జోస్యాలు నిజం కావడంతో.. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులలో కొందరు ఆయన జాతకాలను బలంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు ఆయనతో ప్రత్యేకంగా దోష నివారణ పూజలు సైతం చేయించుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.