మంత్రి జూపల్లి స్ఫూర్తితో.. వెంకటరమణకు రూ.75 వేల ఆర్థిక సాయం
ఆదిలాబాద్, జూన్ 26: జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రేరణతో ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం కైలాసనగర్‌లో నివసిస్తున్న దివ్యాంగ యువకుడు వెంకటరమణను ఆయన నివాసంలో కలిసి రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు వెంకటరమణ ఇంటికి వెళ్లి ఆయన ప్రతిభను అభినందించి స్ఫూర్తినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో స్పందించిన కంది శ్రీనివాస్ రెడ్డి ఆర్ధిక సహాయం అందించారు. వెంకటరమణ పట్టుదలను కంది కొనియాడారు.
అందజేసిన రూ.75 వేలతో వెంకటరమణకు అవసరమైన అత్యాధునిక ఫౌలర్ స్ట్రెచర్ (Fowler Bed) కొనుగోలు చేసి అందజేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కాకు సూచించారు. దీంతో వెంకటరమణకు మరింత సౌకర్యవంతమైన జీవనం కల్పించవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా వెంకటరమణ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ, అవసరమైనప్పుడు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కంది శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.








