డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.
* మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. అక్రమ రవాణాపై ‘జీరో టాలరెన్స్.
* బాధితులకు అండగా నిలుస్తాం.. గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తాం.
* యువతకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ సీఎం చంద్రబాబు పిలుపు.
అమరావతి:మహా.
మత్తు రక్కసి కోరల నుంచి యువతను రక్షించి, వారి ఉజ్వల భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో ప్రచార ఉద్యమానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ గడ్డపై మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఏమాత్రం తావులేదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. డ్రగ్స్ రవాణా, విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ (సహించేది లేదనే) విధానంతో కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. యువత జీవితాలతో చెలగాటమాడుతూ డ్రగ్స్ ట్రాఫికింగ్‌కు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
తెలిసీతెలియక మాదకద్రవ్యాల వ్యసనం బారిన పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్న బాధితుల పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.








