- ఇగో పక్కన పెట్టి వెంటనే మోటార్లు ఆన్ చేయండి.
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
హైదరాబాద్ , మహా.
సాగునీరు అడిగిన రైతులపై ప్రతిపక్షాల రక్తం చల్లాలని మాట్లాడటం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వకుండా పట్టిసీమకు నీటిని వదిలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుత నాయకుడివిగా కాకుండా శాడిస్టుగా ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశారు. రైతులు నీళ్లు అడిగితే రాయి కట్టుకుని దూకాలని, బెల్టుతో కొట్టాలని మాట్లాడటం అత్యంత బాధాకరమని అన్నారు. గోదావరిలో నీళ్లు లేవని ప్రభుత్వం ప్రచారం చేయగా, కేటీఆర్ ప్రత్యక్ష ప్రసారంలో గోదావరిలో ప్రవహిస్తున్న నీటిని చూపించడంతో ప్రభుత్వం మాట మార్చిందని ఎద్దేవా చేశారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు 93.5 మీటర్ల నీటిమట్టం వద్ద పనిచేస్తాయని, ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 97.5 మీటర్లకు చేరడంతో గేట్లు మూయాల్సిన అవసరం లేకుండానే మోటార్లు నడపవచ్చని హరీశ్ రావు తెలిపారు. లక్ష క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని ఎత్తిపోసేందుకు ఎలాంటి సాంకేతిక అడ్డంకి లేదని, ఈ విషయంలో సీఎం చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ దుష్ప్రచారమేనని ఆయన పేర్కొన్నారు. కేవలం రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎల్లంపల్లికి తరలించవచ్చని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికే సూచించినప్పటికీ, గతంలో చేసిన విమర్శలు తప్పని తేలిపోతాయనే భయంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేసిందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. 2004లో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినప్పటి నుంచి 2014 వరకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేయలేకపోయారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేసి అదనపు నిధులు వెచ్చించి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చిందని వివరించారు.
ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ మినహా చాలా తక్కువ నీరు మాత్రమే ఉందని, ఎన్టీపీసీ, సింగరేణి, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భారీగా నీరు అవసరమవుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇప్పటికైనా నీటిని ఎత్తకపోతే భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి దెబ్బతిని రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్న సీఎం వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా, బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల ద్వారా 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పాలనలో 46 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందగా, బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని చెప్పారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2 కోట్ల 60 లక్షల టన్నులకు పెరగడం కేసీఆర్ ప్రభుత్వ వ్యవసాయ విధానాల ఫలితమేనని పేర్కొన్నారు.
అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీరు నిల్వ చేస్తే భద్రాచలం మునిగిపోతుందన్న ప్రభుత్వ వాదనను కూడా హరీశ్ రావు కొట్టిపారేశారు. 2022లో భారీ వరదల సమయంలో కూడా భద్రాచలం పరిస్థితి అదుపులోనే ఉందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్న ఆరోపణలు కూడా అవాస్తవమని, మొత్తం ఖర్చు సుమారు రూ.87 వేల కోట్లేనని చెప్పారు. మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య భాగమే సమస్యకు గురైందని, మిగిలిన వ్యవస్థ సురక్షితంగానే ఉందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అందుబాటులో ఉన్న ప్రతి చుక్క నీటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు అన్నారు. కన్నెపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా వెంటనే నీటిని ఎత్తాలని డిమాండ్ చేశారు. దేవాదులలో పది మోటార్లకు బదులుగా నాలుగు మాత్రమే నడుపుతున్నారని, వరంగల్, ధర్మసాగర్, పాలకుర్తి ప్రాంతాల్లో చెరువులు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలను విస్మరించి పట్టిసీమకు నీటిని వదులుతూ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వం తనపై కేసులు పెట్టినా, జైలుకు పంపినా తాను సిద్ధమేనని, కానీ రైతుల పంటలను ఎండబెట్టే నిర్ణయాలను మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. వెంటనే ఈగోలు, రాజకీయ పంతాలు పక్కనపెట్టి కన్నెపల్లి, దేవాదుల మోటార్లను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








