Mahaa Daily Exclusive

  పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..

Share

• విజయవంతంగా పూర్తైన భుజం శస్త్రచికిత్స.

ముంబయి, మహా:

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబయిలో పరామర్శించారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అక్కడికి వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కల్యాణ్, వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. సినిమా షూటింగ్‌ల సమయంలో తగిలిన పాత గాయాల ప్రభావంతో ఈ సమస్య తీవ్రతరం కావడంతో ఆపరేషన్ అవసరమైందని వైద్యులు తెలిపారు.

ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో కూడా తీవ్రమైన భుజం నొప్పిని భరిస్తూనే పవన్ కల్యాణ్ కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమాలు పూర్తైన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోగా, శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు.

ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం సుమారు మూడున్నర గంటలపాటు సంక్లిష్ట శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

కాగా, ఇటీవలే సైనస్ సమస్యకు కూడా పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. తాజా భుజం ఆపరేషన్ అనంతరం కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.