Mahaa Daily Exclusive

  మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి..! బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రాంచందర్ రావు..

Share

హైదరాబాద్, మహా.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచిన మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు, ఏజెన్సీల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆయన కార్మికులకు సంఘీభావం తెలిపారు.

 

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది విద్యార్థులకు ఆహారం అందిస్తూ సేవలందిస్తున్న 54 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు.

 

గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు ₹10 వేల గౌరవ వేతనం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గుడ్లు వంటి వాటి ధరలు విపరీతంగా పెరిగినా, పదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్ల ప్రకారమే నిధులు విడుదల చేయడం వల్ల కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

 

ప్రస్తుతం అందిస్తున్న ₹3 వేల గౌరవ వేతనాన్ని కూడా సకాలంలో చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపించారు. దీనివల్ల కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు ₹10 వేల గౌరవ వేతనాన్ని వెంటనే అమలు చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ తరఫున తానే స్వయంగా లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.

 

మధ్యాహ్న భోజన కార్మికులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుందని రాంచందర్ రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, బీజేపీ నాయకులు, పెద్ద సంఖ్యలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.