Mahaa Daily Exclusive

  హఫీజ్ సయీద్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్…

Share

హఫీజ్ సయీద్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్.
* పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ కీలక చర్య.
ఢిల్లీ, మహా

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఓపెన్ డేటెడ్ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో హఫీజ్ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఎన్ఐఏ అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసిన రెండు రోజులకే ప్రత్యేక న్యాయమూర్తి ఈ ఆదేశాలు వెలువరించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరారీలో ఉన్న నిందితుడిగా కోర్టు పేర్కొంది.

ఎన్ఐఏ అభియోగపత్రం ప్రకారం, 76 ఏళ్ల హఫీజ్ సయీద్ లష్కరే తోయిబాతో పాటు దాని అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’కు ప్రధాన సూత్రధారి. భారతీయ న్యాయ సంహిత–2023, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. 2008 ముంబై ఉగ్రదాడులకు కూడా హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. భారత్‌తో పాటు అమెరికా కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. వీరిలో అధిక సంఖ్యలో పర్యాటకులు ఉన్నారు. ఈ దాడికి పాకిస్థాన్‌ ప్రేరేపిత ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత వహించినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యిత దాడులు నిర్వహించింది. అనంతరం సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై కూడా ప్రతిదాడులు చేపట్టింది.