అయోధ్య, మహా.
శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ తొలి ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ) నియామక ప్రక్రియ దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పదవి కోసం ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ దరఖాస్తు చేయడంతో ఎంపిక ప్రక్రియపై మరింత దృష్టి నెలకొంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన, పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
2021లో కేంద్ర హోంశాఖ శాఖాపరమైన విచారణలు, క్రమశిక్షణా అంశాలను ప్రస్తావిస్తూ అమితాబ్ ఠాకూర్‌కు నిర్బంధ పదవీ విరమణ కల్పించింది. అనంతరం ఆయన ‘అధికార్ సేన’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం రామాలయ ట్రస్ట్ సీఈఓ పదవికి దరఖాస్తు చేస్తూ, ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాల్లో మరింత పారదర్శకత అవసరమని అభిప్రాయపడ్డారు. ట్రస్ట్ ఖాతాలను స్వతంత్రంగా తనిఖీ చేయించాలని, వార్షిక నివేదికలు, ఆర్థిక లావాదేవీలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.
ఇటీవల భక్తుల కానుకల నిర్వహణపై ఆరోపణలు రావడంతో ట్రస్ట్ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తొలిసారిగా ప్రొఫెషనల్ సీఈఓను నియమించాలని నిర్ణయించింది. ఆలయ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, సిబ్బంది పర్యవేక్షణ వంటి బాధ్యతలను కొత్త సీఈఓ నిర్వహించనున్నారు. ఈ పదవికి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18 వరకు కొనసాగనుండగా, హిందూ మతాచారాలను పాటించే, పెద్ద సంస్థల నిర్వహణలో అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులని ట్రస్ట్ స్పష్టం చేసింది. దీంతో రామాలయ ట్రస్ట్ తొలి సీఈఓగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.







