Mahaa Daily Exclusive

  2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం….

Share

2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం.
* వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులపై కేంద్రం-రాష్ట్రం కీలక ముందడుగు.
ఢిల్లీ, మహా.
తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. వరంగల్ (మామునూరు) విమానాశ్రయ నిర్మాణాన్ని 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూసేకరణ పూర్తి చేయడం వల్లే ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయని ప్రశంసించారు.
వరంగల్ విమానాశ్రయానికి అవసరమైన 700 ఎకరాల భూమి ఇప్పటికే విమానాశ్రయ సంస్థకు అప్పగించారని, సరిహద్దు గోడ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు. రన్‌వే నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కూడా సిద్ధంగా ఉందని, మరో మూడు నుంచి నాలుగు వారాల్లో టెర్మినల్ భవన నిర్మాణానికి టెండర్లు పిలిచి పూర్తిస్థాయి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కాకతీయుల కళా వైభవాన్ని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఆదిలాబాద్ విమానాశ్రయంపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఈ విమానాశ్రయం అభివృద్ధికి మరో 1,500 ఎకరాల భూసేకరణ అవసరమని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. భూసేకరణ పూర్తయిన తర్వాత అక్కడ పౌర విమానాశ్రయంతో పాటు రక్షణ అవసరాలకు ఉపయోగపడే సదుపాయాలు కూడా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
దేశంలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా 90కి పైగా కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని, రానున్న పదేళ్లలో ఉడాన్ పథకం కింద రూ.30 వేల కోట్లతో మరో 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి కూడా వేగంగా పూర్తయ్యేలా కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.