రైల్వేల్లో మరో 8 సంస్కరణలు.
* ‘రిఫార్మ్ ఎక్స్ప్రెస్’కు కేంద్రం వేగం.
ఢిల్లీ, మహా.
భారత రైల్వే వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ‘రిఫార్మ్ ఎక్స్ప్రెస్’ కార్యక్రమంలో భాగంగా మరో 8 కీలక నిర్మాణాత్మక సంస్కరణలను ప్రకటించారు. రైల్వే రంగంలో సామర్థ్యాన్ని పెంచడం, నవకల్పనకు ప్రోత్సాహం ఇవ్వడం, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కొత్త సంస్కరణలతో దేశంలో లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడం, సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, పర్యావరణహిత సరకు రవాణాను విస్తరించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల అమలును మరింత వేగవంతం చేయడంతో పాటు, రైల్వే వ్యవస్థలో సాంకేతిక ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ఈ సంస్కరణలు దోహదపడతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన ’52 వారాల్లో 52 సంస్కరణలు’ లక్ష్యంలో భాగంగానే ఈ కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైల్వే వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచడం, పారదర్శకతను మెరుగుపరచడం, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం, దేశ రైల్వే రంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.







