- ఆసుపత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్చార్జ్
- ముంబై నుంచి హైదరాబాద్‌కు రాక
- నాలుగు మాసాల విశ్రాంతి సూచించిన వైద్యులు
- మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ సెషన్లు
హైదరాబాద్, మహా : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో బుధవారం వైద్యులు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పవన్ కళ్యాణ్ ముంబయి నుంచి నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినప్పటికీ ఆయన మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేనాని ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు.
శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య బృందం పవన్ కళ్యాణ్‌కు పలు కీలక సూచనలు చేసింది. ఆపరేషన్ జరిగిన కుడి భుజం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. అంతవరకు భుజంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలని కోరారు. వైద్యుల సూచనల మేరకు మరో మూడు వారాల తర్వాత నుంచి ఆయనకు రెగ్యులర్ ఫిజియోథెరపీ ప్రారంభం కానుంది. ఈ ఫిజియోథెరపీ సెషన్ల ద్వారా భుజం కదలికలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని వైద్య నిపుణులు వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన మరికొన్ని రోజుల పాటు క్రియాశీలక రాజకీయ పర్యటనలకు దూరంగా ఉండి పూర్తిగా విశ్రాంతికే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.








