Mahaa Daily Exclusive

  రూ.2.19 లక్షల కోట్లకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్…ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం….

Share

ఢిల్లీ, మహా.
దేశ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో మొత్తం రూ.2,19,353 కోట్ల విలువైన ఏడు ప్రధాన ప్రాజెక్టులు, విధానాలకు ఆమోదం లభించింది. సెమీకండక్టర్ల తయారీ, మొబైల్ ఫోన్ ఉత్పత్తి, ఎరువుల రంగంలో స్వయం సమృద్ధి, వారణాసి మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వే విస్తరణ వంటి రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు.

భారత్‌ను ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సెమీకాన్–2.0 కార్యక్రమానికి కేంద్రం రూ.1,27,500 కోట్ల భారీ కేటాయింపును ఆమోదించింది. ఈ నిధులతో అత్యాధునిక సెమీకండక్టర్ తయారీ యూనిట్లు, చిప్ డిజైన్, ప్యాకేజింగ్, పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించనున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశ స్వయం సమృద్ధిని పెంచడంతో పాటు ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌కు మరింత కీలక స్థానం కల్పించడమే ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని మరింత విస్తరించేందుకు మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద రూ.62,500 కోట్ల కేటాయింపుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయంగా మొబైల్ ఫోన్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు ఎగుమతులు వృద్ధి చెందుతాయని, వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశాన్ని ప్రపంచ మొబైల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి జాతీయ యూరియా పెట్టుబడి విధానం–2026కు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచడం, రైతులకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచడం ఈ విధానం ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది. దీనికి ప్రత్యేక ఆర్థిక కేటాయింపులు చేయకపోయినా, విధానపరమైన మార్పుల ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశీయ ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు తీసుకోనున్నారు.

పవిత్ర క్షేత్రమైన వారణాసి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ఆధునిక రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రూ.25,446 కోట్లతో రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వరుణా నది వెంబడి రూ.10,998 కోట్ల వ్యయంతో నాలుగు, ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుండగా, గంగా నది వెంబడి రూ.14,448 కోట్లతో ఆరు లేన్ల అత్యాధునిక ఎలివేటెడ్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వారణాసి నగరంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం రూ.3,907 కోట్లతో రెండు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఒడిశాలోని పారాదీప్–హరిదాస్‌పూర్ రైల్వే మార్గాన్ని రూ.2,542 కోట్ల వ్యయంతో డబ్లింగ్ చేయనుండగా, డాంగోవాపోసి–రాజ్‌ఖర్సవాన్ మార్గంలో రూ.1,365 కోట్లతో నాలుగో రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల విస్తరణ, వ్యవసాయ రంగ అభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముఖ్యంగా సెమీకండక్టర్లు, మొబైల్ తయారీ రంగాల్లో భారీ పెట్టుబడులు భారత్‌ను ప్రపంచ సరఫరా గొలుసులో మరింత బలోపేతం చేస్తాయని, యూరియా విధానం రైతులకు ప్రయోజనం చేకూర్చనుండగా, వారణాసి, రైల్వే ప్రాజెక్టులు దేశ రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించనున్నాయని ఆయన పేర్కొన్నారు.

Latest