Mahaa Daily Exclusive

  పార్లమెంట్ సమావేశాలకు కొత్త మార్గదర్శకాలు….స్మార్ట్ పరికరాలపై ఆంక్షలు…

Share

ఢిల్లీ, మహా.
జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు నిర్వహించనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం సభ్యులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సమావేశాల సమయంలో భద్రత, వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ గ్లాసులు, పెన్ కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవద్దని సభ్యులను కోరింది.

ప్రస్తుతం మార్కెట్‌లో సులభంగా లభ్యమవుతున్న ఈ స్మార్ట్ పరికరాలను రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీయడానికి లేదా ఇతరుల గోప్యతకు భంగం కలిగించే విధంగా వినియోగించే అవకాశం ఉన్నందున వాటిపై పరిమితులు విధించినట్లు లోక్‌సభ సచివాలయం బులెటిన్‌లో పేర్కొంది. సమావేశాల సమయంలో ఎంపీలు అలాంటి పరికరాలను వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, ప్లకార్డుల ప్రదర్శన, ఆయుధాల ప్రదర్శన, మతపరమైన కార్యక్రమాల నిర్వహణను పూర్తిగా నిషేధిస్తున్నట్లు సచివాలయం స్పష్టం చేసింది. అలాగే కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన చిత్రాలు, పోస్టర్లు, అవమానకర నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లను కూడా ప్రదర్శించరాదని పేర్కొంది.

ఇతర సభ్యులు తమ కార్యాలయాలు, ఛాంబర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా వెళ్లేలా పార్లమెంట్ ప్రవేశ ద్వారాల వద్ద ఆందోళనలు, నిరసనలు నిర్వహించవద్దని ఎంపీలకు సూచించింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొందరు సభ్యులు పార్లమెంట్ గేట్ల వద్ద నిరసనలు చేపట్టిన ఘటనలను ప్రస్తావిస్తూ, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

పార్లమెంట్ సమావేశాలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి సభ్యుడు సభా నియమాలను గౌరవించాలని లోక్‌సభ సచివాలయం కోరింది. భద్రత, క్రమశిక్షణ, గోప్యత పరిరక్షణకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

Latest