Mahaa Daily Exclusive

  విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం…

Share

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం.
* జీరో టాలరెన్స్ విధానానికి డీజీపీ ఆదేశాలు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణపై హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈగల్ విభాగం అధికారులతో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తప్పనిసరిగా యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యాసంస్థలో ఒక క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ నియామకం చేపట్టి విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నివారణ చర్యలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యాంపస్ పరిసరాల్లో అనుమానాస్పద కదలికలు, డ్రగ్స్ సరఫరా ప్రయత్నాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణలో నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. అవసరమైతే ఆయా విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడే పరిస్థితి ఏ రూపంలోనూ సహించబోమని ఆయన స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

డ్రగ్స్ నిర్మూలనలో పోలీసు శాఖ ఒక్కటే కాకుండా విద్యాశాఖ, ఆరోగ్యశాఖ సమన్వయంతో పనిచేయాలని డీజీపీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు సైకాలజిస్టులు, కౌన్సెలర్ల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం, పోలీసు శాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు డీజీపీ తెలిపారు. విద్యాసంస్థల్లో అమలు చేయాల్సిన విధివిధానాలపై త్వరలోనే ప్రామాణిక కార్యాచరణ విధానాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించే ముందు మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఐజీ పద్మజా రెడ్డి, ఎస్పీ గిరిధర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణకు చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు. విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులు నిర్ణయించారు.

Latest