Mahaa Daily Exclusive

  ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవుల భర్తీ:టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Share

హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, గతంలో పనితీరు కనబరిచిన వారికి మరోసారి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీల పనితీరును పార్టీ నిరంతరం సమీక్షిస్తోందని, పనితీరు సంతృప్తికరంగా లేకపోతే అవసరమైన చోట మార్పులు చేసే అవకాశం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత నియామకాలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై పార్టీ వ్యవహారాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. పదవుల పునర్నియామకంపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని, మండల కమిటీల ఏర్పాటులో డీసీసీ అధ్యక్షుల నివేదికలకే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
ఖమ్మం రాజకీయాలపై ఇటీవల ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల వివాదంపైనా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ అంశంపై రేణుకా చౌదరితో తాను మాట్లాడానని తెలిపారు. ఖమ్మంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కాంగ్రెస్ వైపు చూస్తున్నాయనే ఉద్దేశంతో వ్యాఖ్యానించానని రేణుకా చౌదరి తనతో చెప్పారని, అయితే ఆమె వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి దుష్ప్రచారం చేశారని అన్నారు.
మిత్రపక్షమైన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుతో కాంగ్రెస్‌కు ఎలాంటి విభేదాలు లేవని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానికంగా కాంగ్రెస్ క్యాడర్ ప్రయోజనాలను కాపాడే క్రమంలోనే కొన్ని వ్యాఖ్యలు వచ్చి ఉండొచ్చని తెలిపారు. అలాంటి సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి చిన్న అంశాన్ని గాంధీభవన్‌కు తీసుకురావాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు సూచించారు.
రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షుడు, నలుగురు లేదా ఐదుగురు మినహా మిగిలిన డీసీసీ అధ్యక్షులంతా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

Latest