అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ చట్టం–2019 నిబంధనల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కమిటీ సభ్యుల పదవీకాలం మూడేళ్లు లేదా 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఉంటుందని, వీటిలో ఏది ముందుగా వస్తే అదే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
కమిటీలో చార్టర్డ్ అకౌంటెంట్, ప్రజా ఆర్థిక నిపుణుడి విభాగానికి తిరుమలశెట్టి వెంకట రంగ సత్య భానుమూర్తిని సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. ఉన్నత విద్య పరిపాలన విభాగం నుంచి డాక్టర్ మన్యాల రామలింగ రాజు, పూజారి హరి ప్రకాష్‌లను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అదేవిధంగా ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధిగా వీవీఐటీ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ వాసిరెడ్డి విద్యాసాగర్‌ను కమిటీ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఫీజుల నిర్ణయం, నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించిన అంశాల్లో ఈ కమిటీ కీలక బాధ్యతలు నిర్వహించనుంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ఫీజు నియంత్రణ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది.








