పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలో శుభవార్త.
• 90 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతుల దిశగా అడుగులు.
• అమర రాజా గిగా యూనిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్, మహా.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వినిపిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి అవసరమైన అనుమతులు సాధించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపుల అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ తయారీ యూనిట్‌ను బుధవారం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న డిండి, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజోలిబండ మళ్లింపు పథకం ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని అనుమతులు సాధించి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను పాలమూరు బిడ్డనని, వెనుకబడిన జిల్లాను అభివృద్ధిలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పాలమూరు జిల్లాలో విద్య, నీటిపారుదల, పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. జిల్లాలో ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యంగ్ ఇండియా సమగ్ర రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి అధునాతన శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.
పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణను దేశంలో ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పెట్టుబడి విధానాల్లో ప్రజాప్రయోజనాలకు అనుకూలమైన వాటిని కొనసాగిస్తూ, అవసరమైన చోట మెరుగులు దిద్ది కొత్త విధానాలను తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా పర్యాటకం, ఇంధనం, వైద్యం, క్రీడలు తదితర రంగాలకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ లక్ష్యాల సాధనలో అమర రాజా వంటి సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు.
పారిశ్రామికాభివృద్ధి కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారని, అందుకు ప్రతిఫలంగా పరిశ్రమలు స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సంస్థలు వ్యవహరించాలని కోరారు.
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగం సవాళ్లు ఎదుర్కొంటోందని సీఎం పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పాలంటే విద్యుత్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీలో అమర రాజా సంస్థ చేపడుతున్న పెట్టుబడులు దేశానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. 32 గిగావాట్ గంటల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ దేశ ఈవీ రంగానికి కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు. సంస్థలో ఇప్పటికే 700 మందికి ఉద్యోగాలు కల్పించగా, వారిలో 400 మంది మహిళలు ఉండటం అభినందనీయమన్నారు.
నాలుగు దశాబ్దాలుగా పారిశ్రామిక రంగంలో విజయవంతంగా కొనసాగుతున్న అమర రాజా సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం అన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలతో పోటీ పడుతూ దేశానికి పేరు తీసుకొస్తున్న అమర రాజా సంస్థను అభినందించారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోటీపడే స్థాయిలో సంస్థ ఎదగడం విశేషమని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా చైనా ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో భారతీయ సంస్థలు పోటీతత్వాన్ని పెంచుకోవాలని, అలాంటి ప్రయత్నాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అమర రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్, ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








