Mahaa Daily Exclusive

  2034 నాటికి లక్ష కోట్ల పెట్టుబడులు రావాలి…అమెజాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు….

Share

 

హైదరాబాద్, మహా.
భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2034 నాటికి నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాల సాధనకు తెలంగాణ ప్రయాణం ప్రారంభమైందని ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి అమెజాన్ డేటా సెంటర్ తొలి మెట్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

దేశంలోనే అభివృద్ధి చెందిన మోడల్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే క్రమంలో అమెజాన్ కీలక భాగస్వామిగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. వచ్చే సంవత్సరాల్లో రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా సంస్థ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అనుమతులు, సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు.

భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం తెలిపారు. ప్రపంచంలోని ఫార్చూన్–500 సంస్థలను ఆకర్షించే ఉద్దేశంతోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామని, అందులో 108 దేశాల ప్రతినిధులు, మూడు వేలకుపైగా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని గుర్తుచేశారు. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థల రాకతో మరిన్ని ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణ వైపు ఆకర్షితులవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ స్థూల దేశీయోత్పత్తిలో రాష్ట్రం ఇప్పటికే ఐదు శాతం మేరకు వాటా అందిస్తోందని, 2047 నాటికి దీన్ని పది శాతానికి పెంచాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

ఈ లక్ష్యాల సాధనకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. అందుకే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సహకారంతో తెలంగాణ రైజింగ్–2047 విజన్ పత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచేందుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని స్పష్టం చేశారు.

వచ్చే 14 సంవత్సరాల్లో అమెజాన్ సంస్థ తెలంగాణలో ఏడు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఎం తెలిపారు. అయితే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే దిశగా సంస్థ ముందుకు రావాలని కోరారు. పెట్టుబడుల పురోగతిపై ప్రతి నెలా స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పష్టమైన విధానాలను రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. పర్యాటకం, వైద్యం, క్రీడలు తదితర రంగాలకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అమెజాన్ డేటా సెంటర్ తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో తొలి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి కార్యాచరణ చేపట్టామని సీఎం వివరించారు. హైదరాబాద్ మహానగరాన్ని సేవారంగ కేంద్రంగా, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు పారిశ్రామిక తయారీ కేంద్రంగా, ఆర్‌ఆర్‌ఆర్ వెలుపలి ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూసీ నది పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, డీజిల్‌తో నడిచే మూడు వేల ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. నగరంలో ఉన్న రెండు లక్షల డీజిల్ ఆటోలను దశలవారీగా మారుస్తూ విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఇందుకోసం ప్రతి సంవత్సరం రూ.1,500 కోట్ల ఆదాయాన్ని వదులుకుని కూడా ఈవీలపై జీరో పన్ను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్, నీటి వనరులు, భూమి, నైపుణ్యాలు కలిగిన యువశక్తిని సిద్ధం చేస్తే తెలంగాణ తయారీ రంగంలో చైనాతో పోటీపడే స్థాయికి ఎదుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని ప్రభుత్వం ఎప్పటికీ మరవదని, వారికి మరింత మెరుగైన పరిహారం, భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, అమెజాన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest