Mahaa Daily Exclusive

  డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా?.తిరిగి వస్తే ఉరిశిక్ష తప్పదన్న ప్రభుత్వ సలహాదారు.

Share

ఢాకా, మహా.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది చివరి నాటికి స్వదేశానికి తిరిగి వెళ్లే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్‌కు చేరుకుని అవామీ లీగ్ పార్టీని తిరిగి బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హసీనా స్వదేశానికి తిరిగి రావడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్‌కు సలహాదారుగా ఉన్న జహీద్ ఉర్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ, షేక్ హసీనా దేశానికి తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ఆమెపై నమోదైన కేసులకు సంబంధించి న్యాయ ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన పరిస్థితుల్లో ఆమెకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
హసీనా తన తరఫున ప్రపంచంలోని ప్రముఖ న్యాయవాదులను నియమించుకునే పూర్తి హక్కు ఉందని జహీద్ ఉర్ రెహమాన్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌లో జరిగే విచారణ పారదర్శకంగా ఉంటుందని, అవసరమైతే అంతర్జాతీయ పరిశీలకులను కూడా అనుమతించే అవకాశముందని తెలిపారు. న్యాయస్థానంలో జరిగే విచారణ, సమర్పించే ఆధారాల ఆధారంగా గతంలో వచ్చిన తీర్పులో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని అన్నారు.
అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయిన అనంతరం కోర్టు నిర్ణయమే తుది నిర్ణయమవుతుందని ఆయన స్పష్టం చేశారు. విచారణలో సమర్పించే వాదనలు, సాక్ష్యాధారాల ఆధారంగా గత తీర్పు కొనసాగవచ్చు, సవరించబడవచ్చు లేదా హసీనా నిర్దోషిగా విడుదలయ్యే అవకాశం కూడా పూర్తిగా న్యాయస్థానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తారన్న వార్తలు, ప్రభుత్వ సలహాదారు చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఆమె స్వదేశానికి తిరిగి వస్తారా, వస్తే తదుపరి రాజకీయ, న్యాయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Latest