Mahaa Daily Exclusive

  ప్రపంచ స్థాయి ఆర్థిక నగరంగా అమరావతి….సీఎం చంద్రబాబు దిశానిర్దేశం…

Share

అమరావతి, మహా..
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్ర పట్టణాభివృద్ధితో అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల రాజధానిగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్–2 అమలు పురోగతిపై బుధవారం ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చి నివసించేలా సమగ్ర ప్రణాళికతో రాజధానిని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. నగర విస్తరణ, మౌలిక వసతులు, రవాణా, ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు పరిధి, అమలు విధానం, దశలవారీ కార్యాచరణపై ప్రజెంటేషన్ ఇచ్చారు. నగర ప్రాంతాల ప్రణాళిక, రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన నమూనాలను ముఖ్యమంత్రికి వివరించారు.

ఉద్యోగాల కల్పనే అమరావతి అభివృద్ధికి ప్రధాన లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. సృజనాత్మక పరిశ్రమలు, ఆధునిక సేవారంగ సంస్థలకు అనుకూలంగా ఉండేలా క్రియేటివ్ సిటీ భావనతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాలతో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సమర్థవంతమైన రవాణా వ్యవస్థ, ఆధునిక పట్టణ మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి విధానాలతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి సమస్యలు ఎదురైనా, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించడం వల్ల రాజధాని ప్రాంతానికి నీటి లభ్యత మెరుగుపడిందని చంద్రబాబు గుర్తు చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వనరుల నిర్వహణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచే ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానాలను అమలు చేసి సుస్థిర నగర నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పి. నారాయణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సింగపూర్ ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest