ఖమ్మం, మహా.
వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం అంజనపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీసు కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం కార్యక్రమ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఫ్యాక్టరీ ప్రాంగణం, సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని పేర్కొన్న జిల్లా కలెక్టర్, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. సభా ప్రాంగణంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను శాస్త్రీయంగా రూపొందించాలని, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు వేర్వేరు మార్గాలు, ప్రత్యేక కూర్చునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బ్యారికేడింగ్, సూచిక బోర్డులు, తగినంత వెలుతురు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు శాఖకు కలెక్టర్ ఆదేశించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బహుస్థాయి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రహదారులను పూర్తిస్థాయిలో పరిశీలించి మరమ్మతులు, శుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పూర్తి చేయాలని తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసి ప్రజలకు ముందుగానే సమాచారం అందించాలని ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంబులెన్సులు, వైద్య బృందాలు, అత్యవసర చికిత్సా కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని, అగ్నిమాపక శాఖ ఫైర్ టెండర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీరు, పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపు వంటి అంశాల్లో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభంతో రాష్ట్రంలో పామాయిల్ సాగుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉన్నందున వారి అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి శాఖ అప్పగించిన బాధ్యతలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, రహదారులు–భవనాల శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, రవాణా, మున్సిపల్, వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల శాఖల అధికారులు, గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.








