Mahaa Daily Exclusive

  ఒంటరి పోరే… స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులుండవు

Share

  • జనసేన సత్తా చాటుతామన్న మంత్రి నాదెండ్ల మనోహర్
  • 2024 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలోద్దన్న ఉద్దేశంతో పొత్తులకు వెళ్ళామని స్పష్టం

గుంటూరు, మహా : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి పొత్తులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి బలం ఉన్న ప్రతి చోటా తప్పకుండా పోటీ చేస్తామన్నారు. ఈ ప్రకటనతో రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. గుంటూరులో నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ జనసేన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఓట్ల చీలకూడదన్న కారణంతో తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గామని నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. ఆనాడు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇచ్చిన మాట కోసం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి నిలబడ్డారని, కూటమిని బలోపేతం చేయడం కోసమే జనసైనికులు నాలుగు అడుగులు వెనక్కి వేశారని పేర్కొన్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికల నాటి ఆ ఫార్ములా ఇప్పుడు వర్తించదని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గుతామని అనుకుంటే పొరపాటని ఆయన తేల్చి చెప్పారు.

కష్టపడే వారికి జనసేన అవకాశాలు కల్పిస్తుంది

ఇప్పటికే దీని గురించి పలు పత్రికలు, ఛానల్స్ లో జనసేన పొత్తులు, భవిష్యత్తుపై వార్తలు ప్రచారం అవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన జనసైనికులకు, నాయకులకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కూటమిలోని ఇతర మిత్రపక్షాలతో తగిన సమన్వయం చేసుకుంటూనే, జనసేన శ్రేణులంతా ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జనసేన పార్టీ తగ్గుతుందని పవన్ కళ్యాణ్ అన్నారని, ఆ మాట మేరకు మేం వ్యవహరించామన్నారు. కూటమిని బలపరిచేందుకు ఆ రోజు అది సరైన నిర్ణయమని భావించామని, రాబోయే రోజుల్లో ఇదే తీరుగా ఉంటామనుకోవద్దని, కూటమిలో ఆ పొత్తు కొనసాగుతుందని భావించొద్దని తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో తాము పట్టు ఉన్న చోట్ల సొంతంగా బరిలోకి దిగి ఫలితాలు రాబట్టాలని భావిస్తున్నామని తేల్చేశారు. ఈ మేరకు పలు జిల్లాల నుంచి స్థానిక నేతల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నాయని, జనసేన నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల కోసం నిలబడాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని. కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు తప్పకుండా ఉంటాయని హామీ ఇచ్చారు.