Mahaa Daily Exclusive

  బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు…..

Share

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.
* 8 మంది మృతి…15 మందికి తీవ్ర గాయాలు.
అహ్మదాబాద్, మహా.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రామోల్–గట్రాడ్ రోడ్డులో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది మృతిచెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు అనంతరం ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.

అధికారుల వివరాల ప్రకారం, ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురిని ఎల్‌జీ ఆస్పత్రికి, మరో ముగ్గురిని అసర్వా సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన గాయపడిన వారికి కూడా సమీప వైద్య కేంద్రాల్లో చికిత్స కొనసాగుతోంది. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన బాణసంచా కర్మాగారం వస్త్రాల్ ప్రాంతంలోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) శిబిరం వెనుక భాగంలో ఉంది. పేలుడు శబ్దం వినిపించగానే శిబిరంలోని సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించడంతో పాటు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు.

తర్వాత ఐదు అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శిథిలాలను తొలగిస్తూ మరెవరైనా చిక్కుకుని ఉన్నారా అనే కోణంలో సహాయక బృందాలు గాలింపు కొనసాగించాయి. పేలుడు తీవ్రత కారణంగా కర్మాగారం దాదాపు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తులో ఈ బాణసంచా కర్మాగారం అవసరమైన అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా, పేలుడు ఎలా సంభవించింది అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి వచ్చిన శబ్దం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారని, కొద్దిసేపు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయిందని చెప్పారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.