జంతర్‌మంతర్‌లో ఉద్రిక్తత.
* సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై మహిళ దాడి.
ఢిల్లీ, మహా.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై ఓ గుర్తుతెలియని మహిళ సిరా తరహా ద్రవాన్ని చల్లి దాడికి పాల్పడింది. మద్దతుదారులతో సమావేశం నిర్వహిస్తూ ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
సమావేశ ప్రాంగణంలోకి ప్రవేశించిన మహిళ ఒక్కసారిగా అభిజీత్ దీప్కేపై ద్రవాన్ని చల్లడంతో అక్కడున్న కార్యకర్తలు ఆమె వైపు పరుగులు తీశారు. దీంతో జంతర్‌మంతర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన భద్రతా సిబ్బంది ఘటనపై విచారణ ప్రారంభించారు. దాడికి పాల్పడిన మహిళ ఎవరు, ఆమె ఉద్దేశం ఏమిటనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం కావడంతో తాను కూడా నిరసన చేపడతానని అభిజీత్ దీప్కే ప్రకటించారు. అనంతరం జరిగిన సమావేశంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఘటన అనంతరం అభిజీత్ దీప్కే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు. దాడికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ “నీలం నా రంగు… జై భీమ్!” అంటూ పోస్టు చేశారు.
ఇదిలా ఉండగా, విద్యార్థుల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారం 21వ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దీక్షను విరమింపజేసి ఆయనను ఆస్పత్రికి తరలించారు. జూన్ 28 నుంచి కొనసాగుతున్న దీక్ష కారణంగా ఆయన సుమారు 9.5 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. ఈ పరిణామాల తర్వాత కొద్ది గంటల్లోనే అభిజీత్ దీప్కేపై దాడి జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.







