ఢిల్లీ, మహా.
గొడవలు, భూ వివాదాలు లేదా వాగ్వాదాల సమయంలో ఉపయోగించే తిట్లు, అసభ్య పదజాలం, బూతులు ఎంత అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ, వాటిని స్వయంచాలకంగా క్రిమినల్ చట్టం ప్రకారం ‘అశ్లీలత’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక పదం లేదా వ్యాఖ్యను అశ్లీలంగా నిర్ధారించాలంటే చట్టంలో నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలించాలని, కేవలం కోపంలో లేదా ఆవేశంలో మాట్లాడిన అసభ్య పదాలు మాత్రమే ఐపీసీ సెక్షన్ 294(బి) కింద నేరంగా పరిగణించబడవని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
ఈ తీర్పు తమిళనాడుకు చెందిన మణి అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై వెలువడింది. 2017లో వ్యవసాయ భూమి వివాదం సందర్భంగా ప్రత్యర్థులను దూషించడంతో పాటు కొడవలితో దాడి చేసి ఒకరి ముక్కు ఎముక విరగ్గొట్టిన కేసులో ట్రయల్ కోర్టు ఐపీసీ సెక్షన్ 294(బి) (అశ్లీలత), 326 (తీవ్రమైన గాయం), 506(II) (క్రిమినల్ బెదిరింపులు), అలాగే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద శిక్ష విధించింది. అనంతరం మద్రాస్ హైకోర్టు ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించిన అభియోగాలను రద్దు చేసినప్పటికీ, మిగిలిన శిక్షలను కొనసాగించడంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసును సమగ్రంగా పరిశీలించిన సుప్రీంకోర్టు, ఐపీసీ సెక్షన్ 294(బి) అమలుకు సంబంధించిన చట్టపరమైన పరిమితులను మరోసారి స్పష్టం చేసింది. “అశ్లీలత” అంటే కేవలం అసభ్య పదజాలం లేదా బూతులు కాదని, అవి వినేవారిలో లైంగిక ప్రేరణ కలిగించేలా లేదా సామాజిక, నైతిక విలువలను దిగజార్చే స్థాయిలో ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ప్రదేశంలో ఇతరులకు తీవ్ర అభ్యంతరం కలిగేలా వ్యవహరించడాన్ని నిరూపించే ఆధారాలు కూడా అవసరమని తెలిపింది.
గొడవల సమయంలో కోపోద్రిక్తతలో ఉపయోగించే తిట్లు, బూతులు వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ, అవి చట్టం నిర్వచించిన అశ్లీలతకు సమానం కావని ధర్మాసనం పేర్కొంది. అందువల్ల ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 294(బి) కింద నమోదైన అభియోగాన్ని రద్దు చేసింది.
అలాగే ఐపీసీ సెక్షన్ 506(II) కింద నమోదైన క్రిమినల్ బెదిరింపుల అభియోగంపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి హెచ్చరిక లేదా కోపంలో చేసిన వ్యాఖ్యను క్రిమినల్ బెదిరింపుగా పరిగణించలేమని, బాధితుడిలో నిజమైన భయం కలిగించే ఉద్దేశం, పరిస్థితులు, ఆధారాలు స్పష్టంగా ఉండాలని పేర్కొంది. ఈ కారణాలతో ఆ సెక్షన్ కింద విధించిన శిక్షను కూడా రద్దు చేసింది.
అయితే దాడి ఘటనపై మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదు. కొడవలితో దాడి చేయడంతో బాధితుడి ముక్కు ఎముక విరిగినట్లు వైద్య ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంటూ ఐపీసీ సెక్షన్ 326 కింద నిందితుడి నేరాన్ని ధృవీకరించింది. శారీరక దాడి తీవ్రమైనదేనని కోర్టు స్పష్టం చేసింది.
అయితే శిక్ష విషయంలో మాత్రం కొన్ని మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ వివాదం భూమికి సంబంధించిన గొడవలో భాగంగా జరిగిందని, నిందితుడి వయస్సు ప్రస్తుతం 70 ఏళ్లకు పైబడిందని, ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని శిక్షను తగ్గించింది. కోర్టు సమయం ముగిసే వరకు జైలు శిక్ష విధిస్తూ, బాధితుడికి పరిహారంగా రూ.50 వేల జరిమానా రెండు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పు భవిష్యత్తులో అసభ్య పదజాలం, బూతులు, వాగ్వాదాలకు సంబంధించిన క్రిమినల్ కేసుల విచారణలో ప్రామాణికంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, తిట్లు నేరం కావని ఈ తీర్పు చెప్పలేదని, కానీ ప్రతి అసభ్య పదాన్ని ఐపీసీ సెక్షన్ 294(బి) కింద “అశ్లీలత”గా పరిగణించడం చట్టబద్ధం కాదనే విషయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, శారీరక దాడి, తీవ్ర గాయాలు, ఇతర నేరాలకు సంబంధించిన చట్టాలు యథావిధిగా వర్తిస్తాయని కూడా ఈ తీర్పు స్పష్టం చేసింది.







