కక్ష సాధింపు కోసమేనని హెడ్ మాస్టర్‌కు లక్ష జరిమానా వేసిన కోర్ట
హైదరాబాద్, మహా : సహోద్యోగిపై ఉన్న పాత కక్షలను తీర్చుకోవడానికి పదవీ విరమణ పొందిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నిర్మల్ జిల్లాకు చెందిన సదరు రిటైర్డ్ హెడ్‌మాస్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్.. పిటిషనర్ ఉద్దేశాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం వ్యక్తిగత వివాదాలను పరిష్కరించుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని పేర్కొంటూ రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
అసలేం జరిగిందంటే..?
నిర్మల్ జిల్లా పంగిరి గ్రామంలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో పి. శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి 2017లో పదవీ విరమణ చేశారు. అయితే తాను సర్వీసులో ఉన్నప్పుడు 2016లో అదే పాఠశాలలో పని చేస్తున్న ఓ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)పై కొన్ని ఆరోపణలు చేస్తూ విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే ఇంతకాలం సైలెంట్‌గానే ఉన్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఇటీవలే సదరు టీచర్‌పై క్రమశిక్షణా చర్యల విచారణను పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారని, వెంటనే విచారణ ముగించి సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై లోతుగా విచారణ జరిపిన జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ ధర్మాసనం పిటిషనర్ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించింది. ఇద్దరూ ఒకే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఎలాంటి అధికారిక ఫిర్యాదులు చేయలేదని కోర్టు గుర్తించింది. పిటిషనర్ 2017లోనే రిటైర్ అయినప్పటికీ.. ఐదేళ్ల తర్వాత అంటే 2022లో ఈ ఫిర్యాదును తెరపైకి తెచ్చి, పదవీ విరమణ తర్వాత కూడా ఈ అంశాన్ని పట్టుకుని వేలాడటాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అంతేకాకుండా సదరు ఉపాధ్యాయుడికి, ఈ హెడ్‌మాస్టర్‌కు మధ్య పరస్పర ఫిర్యాదులు ఉన్నాయనే అసలు వాస్తవాన్ని పిటిషనర్ కోర్టుకు చెప్పకుండా దాచి పెట్టారని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పిటిషనర్ స్వచ్ఛమైన మనసుతో కోర్టును ఆశ్రయించలేదని, కేవలం వ్యక్తిగత కోపాన్ని తీర్చుకోవడానికే న్యాయస్థానాన్ని వాడుకున్నారని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈక్రమంలోనే కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసినందుకు గాను లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. విధించిన లక్ష రూపాయల జరిమానా మొత్తాన్ని నెల రోజులలోగా మలక్‌పేటలోని ప్రభుత్వ అంధురాళ్ల ఉన్నత పాఠశాల ఖాతాలో జమ చేయాలని జస్టిస్ వేణుగోపాల్ పిటిషనర్‌ను ఆదేశించారు.








