Mahaa Daily Exclusive

  ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తే సంక్షేమ పథకాలు నిలిపివేయొచ్చా?

Share

  •  విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

ఢిల్లీ, మహా

ఓటర్ల జాబితా నుంచి ఒక వ్యక్తి పేరు తొలగించినంత మాత్రాన అతడికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నిలిపివేయవచ్చా అనే అత్యంత కీలకమైన రాజ్యాంగపరమైన అంశాన్ని పరిశీలించేందుకు భారత సుప్రీంకోర్టు అంగీకరించింది. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)’ ప్రక్రియ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారికి రేషన్, సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను నిరాకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)తో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 25కు వాయిదా వేసింది.

ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రసేన్‌జిత్ బోస్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం ఒక్కటే కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే రేషన్, అన్నపూర్ణ పథకం, సామాజిక పింఛన్లు, కుల ధ్రువీకరణ పత్రాలు వంటి రాజ్యాంగబద్ధమైన సంక్షేమ ప్రయోజనాలను నిలిపివేయడం చట్టబద్ధం కాదని వాదించారు. పౌరసత్వం లేదా ఓటు హక్కుకు సంబంధించిన వివాదాలు తుది కొలిక్కి వచ్చే వరకు లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోర్టును కోరారు.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం ప్రత్యేక ట్రిబ్యునళ్ల ఎదుట దాదాపు 34 లక్షల అప్పీలు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు కేవలం 38 వేల అప్పీలు మాత్రమే పరిష్కారమయ్యాయని, రాష్ట్రంలో కేవలం 19 ట్రిబ్యునళ్లు మాత్రమే పనిచేస్తుండగా ఇద్దరు న్యాయమూర్తులు రాజీనామా చేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పీళ్లపై తుది నిర్ణయం వెలువడకముందే లబ్ధిదారుల సంక్షేమ పథకాలను నిలిపివేస్తే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వాదించారు.

ట్రిబ్యునళ్ల పనితీరులో మరింత పారదర్శకత అవసరమని కూడా ఆయన సూచించారు. ట్రిబ్యునళ్లకు ప్రత్యేక వెబ్‌సైట్లు ఏర్పాటు చేసి అన్ని ఉత్తర్వులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని కోరారు. అలాగే ఒక వ్యక్తి వద్ద భారత పాస్‌పోర్టు ఉన్నప్పుడు దానిని పౌరసత్వానికి చెల్లుబాటు అయ్యే ఆధారంగా పరిగణించాల్సిందేనని, మళ్లీ అదనపు పత్రాలు కోరడం ఎందుకని ప్రశ్నించారు.

విచారణ సందర్భంగా జస్టిస్ బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బిహార్‌లో నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, ఒక వ్యక్తి భారత పౌరుడా కాదా అనే విషయాన్ని తేల్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేశారు. అలాంటి అనుమానాలు తలెత్తితే సంబంధిత అంశాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మాత్రమే పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఓటర్ల జాబితాల తయారీ, సవరణ, పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన అధికారాలు మాత్రం ఎన్నికల సంఘానికే ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న విశేషాధికారాలను వినియోగించి, పౌరసత్వానికి సంబంధించిన వివాదాలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బాధితులకు రేషన్, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలపై ఎలాంటి ఆటంకం కలగకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల నుంచి సమాధానాలు స్వీకరించిన అనంతరం తదుపరి విచారణలో సుప్రీంకోర్టు సమగ్రంగా పరిశీలించనుంది. ఈ కేసు తీర్పు ఓటర్ల జాబితా, పౌరసత్వ వివాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా కీలక ప్రభావం చూపే అవకాశముందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.