Mahaa Daily Exclusive

  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత….

Share

  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత
  • తెలంగాణలో న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రారంభం
  • ఉద్యోగులు, పెన్షనర్లు సహా 17.88 లక్షల మందికి లబ్ధి
  • రాష్ట్రంలోని 1000కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం
  • డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా సేవలు.. ఎన్ఈహెచ్ఎస్ వెబ్ పోర్టల్ ఆవిష్కరణ

హైదరాబాద్, మహా : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చిరకాలంగా నిరీక్షిస్తున్న ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (ఎన్ఈహెచ్ఎస్) శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్ సీటీ) అధికారిక పత్రాలతో పాటు, ఎన్ఈహెచ్ఎస్ వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులను మంత్రులు ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4.39 లక్షల మంది ఉద్యోగులు, 3.62 లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 17.88 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. వీరికి 114 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అపోలో, యశోద, కిమ్స్, కేర్, స్టార్ వంటి 886 ప్రముఖ కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత (క్యాష్‌లెస్) వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) ధరలకు అనుగుణంగా 1,816 రకాల మెడికల్, సర్జికల్ ప్యాకేజీలను ఈ పథకంలో పొందుపరిచారు. పథకం నిర్వహణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు తమ ప్రాథమిక వేతనం లేదా పెన్షన్‌లో 1.5 శాతం వాటాను విరాళంగా అందజేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా తన వంతుగా జమ చేస్తుంది. నిధుల నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ ప్రభుత్వ, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో కూడిన ఒక ప్రత్యేక ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ ద్వారా తమ డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. గత ఆరోగ్య పథకంలోని లోపాలను అధిగమిస్తూ, ఉద్యోగ సంఘాల నుంచి అందిన సూచనల మేరకు ఈ సరికొత్త పథకాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జూలై మధ్య నాటికి ఈ నగదు రహిత సేవలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ పథకం ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం నుంచి భారీ ఊరటనిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.