- ప్రభుత్వం భూమి ఆక్రమణకు గురి.!
- గ్రామస్తుల ఆందోళన రోడ్డుపై బైఠాయింపు
- ఆ భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి
- భూ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- దండుమైలారం గ్రామ సర్పంచ్ ఈదులకంటి నరేష్ గౌడ్
ఇబ్రహీంపట్నం జులై 17 మహా:
దండుమైలారం గ్రామంలో ప్రభుత్వ భూమి వివాదం తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఇబ్రహీంపట్నం మండలం, దండుమైలారం గ్రామ సర్పంచ్ ఈదులకంటి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, జనార్దన్ రెడ్డి అనే వ్యక్తికి 194 గజాల వ్యక్తిగత భూమి మాత్రమే ఉండగా, అప్పట్లో గ్రామ కార్యదర్శిగా పనిచేసిన తన బంధువు సహకారంతో తన పలుకుబడిని ఉపయోగించి సుమారు నాలుగు ఎకరాలకు పైగా సర్కార్ భూమిని ఆక్రమించి, ప్రహరీ గోడ నిర్మించుకున్నారని వారు ఆరోపించారు. ఆక్రమిత భూమిని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని గ్రామ పంచాయతీకి అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. గ్రామంలో సొంత ఇంటి స్థలం లేని నిరుపేద కుటుంబాలకు, అదే భూమిలో ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయాలని సర్పంచ్‌తో పాటు గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. సర్కార్ భూములను కాపాడుతూ ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.







