Mahaa Daily Exclusive

  ‘ప్రయాణికులను రెండో తరగతి వారని పిలవొద్దు’….

Share

‘ప్రయాణికులను రెండో తరగతి వారని పిలవొద్దు’.
* రైల్వేలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.
ఢిల్లీ, మహా.
రైల్వే ప్రయాణికుల హక్కులు, గౌరవం, భద్రత, ప్రమాద పరిహారానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రయాణికులను ‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్’ (రెండో తరగతి ప్రయాణికులు)గా సంబోధించవద్దని భారతీయ రైల్వే శాఖకు స్పష్టమైన సూచనలు చేసింది. ‘క్లాస్’ అనే పదం రైలు కోచ్‌ల వర్గీకరణకు మాత్రమే పరిమితం కావాలని, మనుషులను వర్గీకరించేందుకు ఉపయోగించడం రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి పదజాలం గతంలో ఉన్న సామాజిక, వర్గ వివక్షలను గుర్తుకు తెస్తుందని పేర్కొంటూ భవిష్యత్తులో అధికారిక రికార్డులు, పత్రాల్లోనూ అలాంటి పదాలను ఉపయోగించకుండా చూడాలని రైల్వే శాఖకు సూచించింది.

రైలు ప్రమాదంలో మరణించిన ఓ ప్రయాణికురాలి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ధర్మాసనం మరో కీలక నిర్ణయం వెలువరించింది. ప్రమాద సమయంలో ప్రయాణికుడి వద్ద ఉన్న టికెట్ పోయిందనే కారణంతో పరిహారం నిరాకరించడం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. ప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో టికెట్ పోవడం సహజమేనని, అలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబ సభ్యులు సమర్పించే అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ప్రయాణికుడి వద్ద చెల్లుబాటు అయ్యే టికెట్ లేదని నిరూపించే బాధ్యత పూర్తిగా రైల్వే శాఖదేనని తేల్చిచెప్పింది.

రైల్వే ప్రమాద పరిహారానికి సంబంధించిన చట్టాలను కఠినంగా కాకుండా మానవతా దృక్పథంతో అమలు చేయాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి న్యాయం చేయడమే చట్టాల అసలు ఉద్దేశమని, సాంకేతిక కారణాలు చూపిస్తూ పరిహారాన్ని తిరస్కరించడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు స్పందించాలని సూచించింది.

రైల్వే భద్రతా వ్యవస్థపైనా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భద్రతకు సంబంధించిన నిబంధనలు కాగితాలపై బాగానే కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. రైల్వేల్లో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేస్తే ఒకవైపు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, మరోవైపు రైల్వే భద్రత కూడా గణనీయంగా మెరుగుపడుతుందని అభిప్రాయపడింది.

అదే సమయంలో ప్రయాణికులకూ సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణించడం, రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం లేదా దిగడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రయాణికులు కూడా తమ భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.

ప్రయాణికుల గౌరవం, సమానత్వం, ప్రమాద పరిహారం, భద్రత వంటి అంశాలపై సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు భారతీయ రైల్వే వ్యవస్థలో విధానపరమైన మార్పులకు దారి తీసే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.