Mahaa Daily Exclusive

  గుజరాత్‌లో ఏటీఎస్ భారీ ఆపరేషన్….

Share

గుజరాత్‌లో ఏటీఎస్ భారీ ఆపరేషన్.
* మరో ఐదుగురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్.
ఢిల్లీ, మహా.
గుజరాత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చేపట్టిన భారీ ఆపరేషన్‌లో మరో కీలక విజయం లభించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకకాలంలో నిర్వహించిన విస్తృత సోదాల్లో మరో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. అరెస్టైన నిందితులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా మారే ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించడమే లక్ష్యంగా విచారణను మరింత విస్తరిస్తున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే అరెస్టైన ఎనిమిది మంది నిందితుల విచారణలో లభించిన కీలక సమాచారంతోనే తాజా దాడులు చేపట్టినట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. సేకరించిన ఆధారాల ప్రకారం నిందితులు పేలుడు పదార్థాల తయారీ, టైమర్ ఆధారిత బాంబుల తయారీ, పేలుళ్లు నిర్వహించే విధానాలపై శిక్షణ పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. గత మూడేళ్ల కాలంలో గుజరాత్‌లోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో పేలుడు పరీక్షలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం అవసరమైన రసాయనాలు, పేలుడు పదార్థాలను ఆన్‌లైన్ వేదికలతో పాటు స్థానిక మార్కెట్ల నుంచి సేకరించినట్లు అధికారులు గుర్తించారు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన మరో కీలక అంశం ఏమిటంటే, అరెస్టైన వారిలో ఇద్దరు జమ్మూకశ్మీర్‌కు వెళ్లి ఏకే-47 వంటి అత్యాధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ పొందినట్లు ఆధారాలు లభించాయి. అంతేకాకుండా విషవాయువుల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా నేర్చుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరు వడోదరకు చెందిన వ్యక్తితో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసినట్లు విచారణలో తేలింది.

నిందితుల ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించిన ఏటీఎస్‌కు మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. జిహాద్ భావజాలాన్ని ప్రోత్సహించే 43 పుస్తకాలను వారు డౌన్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. అలాగే కొన్ని మదరసాల ద్వారా తీవ్రవాద భావజాల ప్రచారం జరిగిందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా ఖాదియాసన్ మదరసాలో కొందరు అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు సమాచారం. నందాసన్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లోనే తాజా ఐదుగురు నిందితులు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే అరెస్టైన ఎనిమిది మందిని కోర్టులో హాజరుపర్చగా, తాజా ఐదుగురు నిందితులకు మరో ఏడు రోజుల పోలీసు కస్టడీని కోర్టు మంజూరు చేసింది. కేసు విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కడి కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలు, కమాండోలను మోహరించారు. ఉగ్రవాద శిక్షణ, పేలుడు పదార్థాల సేకరణ, ఆర్థిక లావాదేవీలు, విదేశీ ఉగ్ర సంస్థలతో సంబంధాలు, ఇతర సహచరుల పాత్ర వంటి అన్ని కోణాల్లో ఏటీఎస్ దర్యాప్తును ముమ్మరం చేసింది.

దేశ భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలను ఏ దశలోనూ ఉపేక్షించబోమని, ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను వెలికితీసి చట్టం ముందు నిలబెడతామని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని, సేకరించిన డిజిటల్ ఆధారాలు, కమ్యూనికేషన్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.