Mahaa Daily Exclusive

  ఫిఫా ఫీవర్‌కు తెలంగాణ సర్కార్ గ్రీన్‌సిగ్నల్…బార్ల పనివేళలు పొడిగింపు…

Share

హైదరాబాద్, మహా.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ఫిఫా వరల్డ్ కప్–2026 తుది దశకు చేరుకున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త చెప్పింది. జూలై 18న మూడో స్థానం కోసం ఫ్రాన్స్–ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్, జూలై 19న స్పెయిన్–అర్జెంటీనా మధ్య జరగనున్న ప్రతిష్ఠాత్మక ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర పరిధిలోని బార్ల పనివేళలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు లభించడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం జూలై 18, 19 తేదీల్లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల సందర్భంగా లైసెన్స్ పొందిన బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లు, మైక్రోబ్రూవరీలు సాధారణ సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచేందుకు అనుమతి కల్పించారు. జూలై 18 అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకు, అలాగే జూలై 19న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 19–20 మధ్య రాత్రి 3:00 గంటల వరకు మద్యం విక్రయాలు నిర్వహించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు.

ఈ ప్రత్యేక అనుమతి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలోని లైసెన్స్ పొందిన 2B బార్లు, C1 క్లబ్బులు, TD1, TD2 టూరిజం బార్లు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాల్లో లేదా అనుమతి లేని సంస్థలకు ఈ వెసులుబాటు వర్తించదని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

ఫిఫా వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌లను హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో భారీ ఎత్తున లైవ్ స్క్రీనింగ్ ద్వారా వీక్షించేందుకు వీలుగా బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అయితే పొడిగించిన సమయాలను దుర్వినియోగం చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతించిన సమయం దాటిన తర్వాత ఎలాంటి విక్రయాలు నిర్వహించకూడదని, శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎక్సైజ్ శాఖ, పోలీసు అధికారులు బార్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

ఫిఫా వరల్డ్ కప్ ముగింపు మ్యాచ్‌ల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హోటళ్లు, పబ్‌లు, స్పోర్ట్స్ లాంజ్‌లలో భారీ సంఖ్యలో అభిమానులు మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉండటంతో, నగరంలో మరోసారి ఫుట్‌బాల్ సందడి నెలకొననుంది.