Mahaa Daily Exclusive

  పార్లమెంట్‌ సమావేశాలకు టీడీపీ వ్యూహం సిద్ధం….

Share

పార్లమెంట్‌ సమావేశాలకు టీడీపీ వ్యూహం సిద్ధం.
* సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ.
అమరావతి, మహా.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహరచనలో నిమగ్నమైంది. శుక్రవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభకు చెందిన పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు. జూలై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, కేంద్రం ముందు బలంగా వినిపించాల్సిన డిమాండ్లపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో ప్రధానంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులు, నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడంతో పాటు పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించేలా పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం అత్యంత కీలకమని, దీనిపై కేంద్రంపై నిరంతరం ఒత్తిడి కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది.

రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణ, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన, విదేశీ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర సహకారం అవసరమని సమావేశంలో అభిప్రాయపడింది. అమరావతికి సంబంధించిన పెండింగ్ అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తి కేంద్రం నుంచి పూర్తి సహకారం పొందేలా కృషి చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

రాయలసీమకు సాగునీరు అందించే గోదావరి–పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు, దాని కార్యాచరణ, కేంద్ర ఆర్థిక సహాయం అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు అవసరమైన మౌలిక వసతులు, భూముల కేటాయింపు, పూర్తి స్థాయిలో కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో కొత్త పెట్రోలియం రిఫైనరీల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, భారీ పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాల కల్పనపై కేంద్రాన్ని కోరాలని సమావేశంలో అభిప్రాయపడింది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని ప్రాజెక్టులు సాధించే దిశగా ఎంపీలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారం, ఫేక్ న్యూస్ వ్యాప్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలపై జరుగుతున్న దాడుల అంశాలను కూడా పార్లమెంట్‌లో లేవనెత్తాలని సమావేశంలో నిర్ణయించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలపై కేంద్రంతో చర్చించాలని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా ఎంపీలు తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అభివృద్ధి పనులు, నిధుల అవసరాలను సమావేశంలో ప్రస్తావించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న వివిధ చట్ట సవరణలు, కొత్త బిల్లులపై పార్టీ అనుసరించాల్సిన వైఖరిపైనా సమగ్ర చర్చ జరిగింది.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ , అయోధ్య విరాళాలకు సంబంధించిన అంశాలు, అలాగే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఇతర సమకాలీన అంశాలపై కూడా పార్లమెంట్‌లో పార్టీ తరఫున స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనే ప్రధాన లక్ష్యంగా టీడీపీ ఎంపీలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.